Nokia 1100: అరచేతిలో ఫోన్ ద్వారా అన్ని పనులు జరుగుతున్న రోజులు ఇవి.. కేవలం ఫోన్ మాత్రమే సామాజిక దర్పంగా వెలిగిపోతున్న రోజులు కూడా ఇవే. అందువల్లే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రోజురోజుకు కొత్త కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కేవలం ఈ ఫోన్ మార్కెట్ ద్వారానే మల్టి నేషనల్ కంపెనీలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. జాబితాలో ఇప్పటివరకు ఆపిల్ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్లు నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. చైనా కంపెనీ షావోమి తయారు చేస్తున్న రెడ్ మీ ఫోన్ కూడా అదే స్థాయిలో ప్రాచుర్యం పొందుతోంది.
కేవలం ఆపిల్, రెడ్ మీ మాత్రమే కాకుండా సామ్ సంగ్, ఎంఐ కంపెనీలు తయారు చేస్తున్న ఫోన్లకు కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు మామూలు ఫోన్లు మాత్రమే మార్కెట్లో ఉండేవి.. అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత.. అవసరాలు పెరిగిన తర్వాత ఆండ్రాయిడ్, ఆపిల్ అప్లికేషన్ ఫోన్లు మార్కెట్ ను దున్నేస్తున్నాయి. ఆండ్రాయిడ్ లో రకరకాల వెర్షన్లు మార్కెట్ ను ముంచేస్తున్నాయి. ఇక ఆపిల్ కూడా ప్రతి ఏడాదికి కొత్త కొత్త సిరీస్ లలో ఫోన్లను విడుదల చేస్తోంది. మొత్తంగా చూస్తే ఫోన్ల మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్లను దాటేసింది. ఫోన్ల కోసమే కంపెనీలు ప్రత్యేకంగా తయారు కేంద్రాలను, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.. అయితే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హ్యాండ్సెట్లను కంపెనీలు విక్రయించాయి. అయితే ఇందులో ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్లు ఏంటి అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. చాలామంది ఆపిల్ అని అనేస్తారు.. కానీ అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్లు ఆపిల్ కంపెనీ తయారు చేసినది కాదు. సాంసంగ్ కంపెనీవి అంతకన్నా కావు..
ఆ కంపెనీనే నెంబర్ వన్..
ఇప్పటివరకు మార్కెట్లో ఎన్నో కంపెనీలు మోడల్స్ ను తీసుకొచ్చాయి. కొత్త కొత్త అప్లికేషన్లతో సందడి చేయిస్తున్నాయి. అయినప్పటికీ నోకియా 1100 పై ఉన్న రికార్డును ఏ కంపెనీ ఫోన్లు కూడా బ్రేక్ చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం వందలో 30% వరకు ఐఫోన్స్ కనిపిస్తున్నాయి. కానీ అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ గా మాత్రం నోకియా 1100 రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ల “నోకియా 1100” మొబైల్స్ అమ్ముడుపోయాయి.. దీని తర్వాత “ఐఫోన్ 6/6 ప్లస్” ఫోన్లు 222 మిలియన్లు అమ్ముడుపోయాయి. “నోకియా 105” 200 మిలియన్ ఫోన్లు అమ్ముడుపోయాయి. “ఐఫోన్ 6 ఎస్/ 6 ఎస్ ప్లస్” ఫోన్లు 174 మిలియన్లు అమ్ముడుపోయాయి.. నమ్మకమైన బ్యాటరీ.. అద్భుతమైన వినికిడి సామర్థ్యం. ఎక్కువకాలం పనిచేసే సౌలభ్యం ఉండడంతో నోకియా 1100 తిరుగులేని స్థాయిలో రికార్డు సాధించింది. అప్పట్లో ప్రతి ఒక్కరి చేతిలో నోకియా 1100 ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. 2001 ఒకటి నుంచి సెల్ ఫోన్లు సందడి చేస్తున్న సమయంలో.. నోకియా కంపెనీ 1100 మోడల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ మోడల్ ను 2008 వరకు తయారు చేస్తూనే ఉంది. స్మార్ట్ ఫోన్ వచ్చేనాటి వరకు 1100 మోడల్ మార్కెట్లో నెంబర్ వన్ గా ఉండేదంటే దాని వాడకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. నోకియా కంపెనీ 1100 ద్వారానే వందల కోట్ల ఆదాయం సంపాదించింది. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే తయారీ యూనిట్లను అంతకంతకు పెంచింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ కాలంలో అంతగా అప్డేట్ కాకపోవడంతో నోకియా కంపెనీ తయారుచేసిన హ్యాండ్ సెట్ కు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది.