మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అంటేనే చాలు.. సాధారణ రాజకీయ ఎన్నికల కంటే కూడా తెగ ఆసక్తి రేపుతూనే ఉంటాయి. సినీ ప్రముఖులు ఐక్యత లేకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రాజకీయ నేతల కంటే కూడా తెగ హడావుడి చేస్తుంటారు. ప్రతీసారి వివాదాస్పదం అవుతూనే ఉంటాయి..
తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ బరిలోకి దిగడం.. అతడికి అండగా మెగా బ్రదర్ నాగబాబు సహా కీలక సినీ ప్రముఖులు మద్దతు తెలుపడం.. నాగబాబు గత ‘నరేశ్ ప్యానెల్’ పనితీరును ఎత్తిచూపడంతో వివాదం చెలరేగింది.
ప్రకాష్ రాజ్ కు మద్దతుగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు మాట్లాడారు. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించారు. మా తరుఫున తాము చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెప్పామన్నారు. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు అనడం షాకింగ్ అనిపించిందని ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ వాపోయారు.
ఇక ట్విస్ట్ ఏంటంటే నరేశ్ ప్యానెల్ లోని శ్రీకాంత్, బెనర్జీ సహా చాలా మంది తమ పదవీకాలం ముగియకముందే ‘ప్రకాష్ రాజ్’ ప్యానెల్ లో చేరిపోయారు. అలా చేరడం చూసి షాక్ అయ్యానని నరేశ్ తెలిపాడు. ఇక తనకు కథలు చెప్పడం అలవాటు లేదని.. కాగితాలతో రావడం అలవాటు లేదని నరేశ్ ఎద్దేవా చేశారు. మొత్తంగా ప్రకాష్ రాజ్ ను, ఆయన చుట్టు ఉన్న వారిపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ కొంత గట్టిగానే కౌంటర్లు పేల్చారు.