
Nandamuri Balakrishna: నట సింహం బాలయ్య బాబు తన సినిమాల వేగం పెంచాడు. ఇప్పటికే అఖండ సినిమాని పూర్తి చేసిన బాలయ్య త్వరలో షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23 వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. హీరోయిన్ శృతి హాసన్ ను ఖరారు చేశారు. ఆమె ఈ సినిమా కోసం బరువు పెరగడానికి కసరత్తులు కూడా చేస్తోంది.
ఇక ఈ సినిమాని డిసెంబర్ లోపు పూర్తి చేయాలని బాలయ్య డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు. ఎందుకంటే.. జనవరి 18 నుంచి అనిల్ రావిపూడి సినిమాకి బాలయ్య డేట్లు ఇవ్వాల్సి ఉంది. నిజానికి అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కావాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా అది కుదరలేదు. అందుకే.. వచ్చే ఏడాది మొదటి నెలలో సినిమాని స్టార్ట్ చేయాలని ‘అనిల్ – బాలయ్య’ తాజాగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.
పైగా తమ కలయికలో వస్తున్న మొదటి సినిమాని సమ్మర్ స్పెషల్ గా తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. అనిల్ కి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి ? ఏ సినిమాని ఎలా డిజైన్ చేయాలి ? లాంటి విషయాల్లో అనిల్ కి మంచి పట్టు ఉంది. ఇక కమర్షియల్ లెక్కలు కూడా అనిల్ కి పెన్నుతో పెట్టిన విద్య.
ముఖ్యంగా హీరో ఎవరైనా తనదైన కామెడీని పెట్టి సినిమాని హిట్ చేయడంలో అనిల్ ఇప్పటికే ముదిరిపోయాడు. కాకపోతే.. బాలయ్య మీద కామెడీ ఏ రకంగానూ వర్కౌట్ అవ్వదు అనేది గత సినిమాల ఫలితాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారం కూడా అనిల్ రావిపూడి – బాలయ్య సినిమాలో కామెడీ ఉంటే బయ్యర్లు కొనడానికి ముందుకు రారు అని కూడా వినిపిస్తోంది.
అందుకే, అనిల్.. బాలయ్య కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నాడు. అయితే బాలయ్యకు వైవిధ్యం కూడా సెట్ అవ్వదు, ఎందుకంటే బాలయ్య అభిమానులకు మంచి మాస్ మసాలా యాక్షన్ అంశాలు కోరుకుంటారు. కాబట్టి… ఇటు బాలయ్య తరహా యాక్షన్ ను చూపిస్తూనే అటు బాక్సాఫీస్ లెక్కలకు అనుకూలంగా స్క్రిప్ట్ ను రాసుకోవాలి. అనిల్ అదే పనిలో ఉన్నాడు. మొత్తమ్మీద వచ్చే ఏడాది సమ్మర్ లో బాలయ్య – అనిల్ కలయికలో హిట్ వస్తోందేమో చూడాలి.