ఇటీవల బిగ్ బాస్ లో ఓ ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. నిన్న దేవి నాగవల్లి ఎలిమినేట్ సందర్భంగా.. అంతకుముందు కూడా తన పేరు ‘నాగార్జున’ అని.. నీ పేరు ‘నాగ’వల్లి.. అని.. నాగ సెంటిమెంట్ చాలా పవర్ ఫుల్ అంటూ నాగార్జున గుర్తుచేసుకున్నారు. అసలు నాగేశ్వరరావు, నాగార్జునకు ఆ ‘నాగ’ ఎలా వచ్చిందనే దానిపై ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ధృవతార అక్కినేని నాగశ్వరరావు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమాకు చుక్కాని లాంటి వారు.. ఏఎన్నార్ కు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. ఆయన సెంటిమెంట్ ప్రకారమే ఏదైనా చేస్తాడని తెలిసింది.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగచైతన్య.. వీరి పేర్లకు ముందు ‘నాగ’ కామన్‌గా ఉంటుంది. దీనికి కారణమేంటో తెలుసా.. ఇలా ‘నాగ’ వచ్చేలా తమ పేర్లను ఎందుకు పెట్టారో ఓ ఇంటర్వ్యూలో హీరో నాగార్జున వివరించారు.
‘నాన్న నాగేశ్వరరావు నానమ్మ కడుపులో ఉన్నప్పుడు రోజూ కలలో నాగుపాము వచ్చేదట. నాన్న పుట్టిన తర్వాత ఇంకా పేరు కూడా పెట్టని కొద్ది రోజులకే.. ఓ రోజు పాలు ఇస్తుండగా నానమ్మకు నాగుపాము పిల్ల కనిపించిందట. అందుకని నాగేశ్వరరావు అని పెట్టారు. ఆ తర్వాత అది నాకు, నాగ సుశీలకు.. ఇలా అందరికీ కొనసాగింది.’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.
చైతూ పుట్టిన తర్వాత చైతన్య అని పేరు పెట్టారట. అప్పుడు నాగార్జున వాళ్ల అమ్మగారు పిలిచీ మరీ చెప్పారట.. నాగ జత చేయమని. దీంతో నాగచైతన్యగా మార్చామని నాగార్జున వివరించారు. సోదరి నాగసుశీలతో కలిసి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ‘నాగ’ రహస్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా నాగ తమకు సెంటిమెంట్ గా కలిసి రావడంతో ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చాడు. నాగ పేర్ల వెనుకున్న రహస్యాన్ని ఇదన్నమాట..