Nagarjuna: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ఆ పై పోసాని తిరుగుబాటు.. ఇలా ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి – పవన్ కళ్యాణ్ సేనకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. అయితే, ఈ యుద్ధంలో తల దూర్చాడు నాగార్జున. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో నాగార్జునదే మొదటి స్థానం.

తన బిజినెస్ లకు ఏ ప్రభుత్వం నుంచి అయినా సమస్య వస్తోందేమో అని అన్ని ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూ ఇన్నాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్న నాగార్జున ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించాడు. ఒక పక్క సినిమా ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని పవన్ విరుచుకుపడితే.. నాగ్ మాత్రం జగన్ ప్రభుత్వం చల్లగా చూస్తోంది అంటూ కామెంట్స్ చేయడం పవన్ ఫ్యాన్స్ ను బాగా ఇబ్బంది పెట్టింది.
నాగ చైతన్య లవ్ స్టోరి సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ సరైన నిర్ణయాలు తీసుకున్నారని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇక థియేటర్ల గురించి నాగార్జున చాలా తెలివిగా మాట్లాడాడు.
తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఏపీలో ఉన్న పరిస్థితిని బట్టి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొన్ని రాష్ట్రాలలో అయితే ఇప్పటికీ థియేటర్లు తెరుచుకోలేదు. ఇలా సాగింది నాగ్ స్పీచ్. అంటే.. జగన్ ఏమి చేసినా కరెక్టే అన్నట్టు నాగార్జున మాట్లాడటం నిజంగా షాకింగ్ విశేషమే.
పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ముఖ్యంగా జగన్ ను ఉద్దేశిస్తూ.. మన ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని (సినిమా వాళ్ళను) మంచి చూపుతో చూశారు.. ఇక పై కూడా మీ బ్లెస్సింగ్స్ మాకుండాలి’ అని నాగ్ వేడుకున్నాడు. ఈ స్పీచ్ తో సినిమా ఇండస్ట్రీలో పవన్ కంటే జగన్ కే ఎక్కువ సపోర్ట్ చేస్తాం అన్నట్టు ఉంది వ్యవహారం. అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పవన్ కి సపోర్ట్ దొరకదా ?