Tandel : మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తండేల్’ మూవీ కి సంబంధించిన ప్రొమోషన్స్ కోసం మూవీ టీం ఎంత బిజీ గా గడుపుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుసగా ఈవెంట్స్ ని నిర్వహిస్తూ, ఇంటర్వ్యూస్ ఇస్తూ క్షణ కాలం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. సినిమాని ఆడియన్స్ కి చేరువ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన ప్రతీ పాట బాంబు లాగా పేలింది. ట్రైలర్ ని చూసిన తర్వాత కూడా ఆడియన్స్ కి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని చూడబోతున్నాము అనే అనుభూతి కలిగింది. ఈ చిత్రాన్ని రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చూశాడు. ఆయనకు అద్భుతంగా నచ్చింది. కొంతకాలం బయటకి రాకూడదు అని ఆయన అనుకున్నప్పటికీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావాలని అనుకున్నాడు.
నేడు హైదరాబాద్ లో అభిమానులకు ఎంట్రీ లేకుండా, కేవలం మూవీ టీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. కానీ ఈ ఈవెంట్ ఇప్పుడు రద్దు అయ్యినట్టు తెలుస్తుంది. అందుకు కారణం అల్లు అర్జున్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్లే. ప్రస్తుతం ఆయన ముంబై లో స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నాడు. నేడు కీలక మీటింగ్ ఉండడంతో ఆయన అందుబాటులో లేడని ఈవెంట్ ని రద్దు చేసారు. రేపు లేదా, ఫిబ్రవరి 4వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ ని చూడొచ్చు అని ఆశపడిన అభిమానులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకి రావడం పెద్ద సంచలనం గా మారింది.
అంతే కాకుండా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అప్పట్లో విషమంగా ఉండడంతో అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ ఈవెంట్స్ మొత్తాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని నార్మల్ అయ్యాయి, తమ అభిమాన హీరో మాటల్ని వినొచ్చు అనుకునేలోపు ఇప్పుడు ఈవెంట్ ని వాయిదా వేయడంతో కాస్త నిరాశకి గురయ్యారు. కానీ మొత్తానికి రద్దు చేయలేదు కదా, ఈరోజు కాకపోతే రేపు, లేదా నాల్గవ తేదీ చూసుకోవచ్చులే అని మళ్ళీ సర్దిచెప్పుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. మొన్న తమిళనాడు లో, నిన్న ముంబై లో తమిళం, హిందీ వెర్షన్స్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని జరిపించారు. తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కార్తీ ముఖ్య అతిథిగా రాగా హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.