Naga Chaitanya: నాగ చైతన్యకు బిగ్ షాక్ తగిలింది. ఆయన లేటెస్ట్ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం అందుతుంది. నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా ప్రత్యేకమైన సెట్ వేశారు. ఆ సెట్ లో వైన్ షాప్ సెటప్ కూడా ఉంది. వైన్ షాప్ ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అభ్యంతరం తెలిపారట. అయితే కొన్ని పరిమితులు విధించి అనుమతి ఇచ్చారట.

నాగ చైతన్య చిత్ర యూనిట్ ఆ పరిమితులు అతిక్రమించిన నేపథ్యంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారట. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో షూటింగ్ అనుమతి రద్దు చేశారట. దీంతో అర్థాంతరంగా చైతు మూవీ షూటింగ్ ఆగిపోయిందట. చేసేది లేక చిత్ర యూనిట్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకున్నారట. తమిళ దర్శకుడు వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ బంగార్రాజు చిత్రంలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
ఇక నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ డిజాస్టర్ అయ్యింది. చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా రికార్డులకు ఎక్కింది. విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది. అవుట్ డేటెడ్ స్టోరీని అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో విక్రమ్ కుమార్ తెరకెక్కించాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. దీంతో వెంకట్ ప్రభు మూవీతో కమ్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు.

మరోవైపు కృతి శెట్టికి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం. ఆమె గత మూడు చిత్రాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరిచాయి. మూడు హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసిన కృతి హ్యాట్రిక్ ప్లాప్స్ కూడా కంప్లీట్ చేసింది. దీంతో నాగ చైతన్యం మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతోంది.