Mr Pregnant Trailer Review: బిగ్ బాస్ షోతో పాప్యులర్ అయిన నటుడు సయ్యద్ సోహెల్. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ బిగ్ బాస్ సీజన్ 4లో రచ్చ చేశాడు. తన ఆట తీరుతో సోహెల్ ఫైనల్ కి వెళ్ళాడు. టాప్ 3లో ఉండగా నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. ఫినాలే గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సోహెల్ కి మరో పది లక్షలు ఇవ్వడం విశేషం. తన మిత్రుడు మెహబూబ్ ఇంటి నిర్మాణానికి అందులో కొంత డబ్బు ఇస్తానని సోహెల్ అన్నాడు.
సోహెల్ హీరోగా చేసే సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేయడానికి సిద్ధమని చిరంజీవి ప్రకటించడం జరిగింది. మొత్తంగా సోహెల్ బిగ్ బాస్ షోతో బాగానే లాభపడ్డాడు. గతంలో సోహెల్ స్టార్ హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. బిగ్ బాస్ షో అనంతరం సోలో హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, లక్కీ లక్ష్మణ్ వంటి చిత్రాలు చేశాడు. అయితే ఇంకా బ్రేక్ రాలేదు.
ఈసారి విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. ఆగష్టు 18న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేశాడు. టాటూ ఆర్టిస్ట్ గా జాలీ లైఫ్ లీడ్ చేస్తున్న సోహెల్ గర్భం దాల్చుతాడు. మగాడు గర్భం దాల్చడమేంటి? అని సమాజం చూస్తుంది. ఒక దశ వరకు ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తాడు. అయితే సమాజం నుండి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం అంత సులభం కాదని తేలిపోతుంది.
చివరికి ప్రేమించే వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ భిన్నంగా చూసి అవమానిస్తారు. అసలు ఒక మగాడు ఎలా గర్భం దాల్చాడు? బిడ్డ మీద తల్లి మాదిరి మమకారం పెంచుకున్న హీరో కథ ఎలా ముగిసిందనేది, మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చూస్తే కానీ తెలియదు. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ తెరకెక్కించారు. సోహెల్ కి జంటగా రూప కోడవయూర్ నటిస్తుంది. అలీ, బ్రహ్మాజీ, వైవా హర్ష కీలక రోల్స్ చేశారు. అప్పిరెడ్డి, రవిరెడ్డి ఎస్, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు.
