Producer Dil Raju: వంద కోట్లు పెట్టి హోటల్ కట్టిన యజమాని కంటే ఐదొందల కూలీకి అక్కడ పని చేసే సర్వర్ కి బిజినెస్ సీక్రెట్స్ తెలుస్తాయి. నేరుగా కస్టమర్స్ ని ఫేస్ చేసే దిగువస్థాయి లేబర్ కి వ్యవస్థలోని లోటుపాట్లపై అవగాహన ఉంటుంది. దిల్ రాజు సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఆయన డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఎదిగారు. థియేటర్ వ్యవస్థలో రాటుదేలిన తర్వాత నిర్మాణంలో అడుగుపెట్టాడు. ఒక సినిమా నిర్మించడం కంటే దాన్ని థియేటర్స్ లోకి తేవడం అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఒక్క తెలుగులోనే ఏడాదికి రెండు వందల నుండి మూడు వందల చిత్రాలు తెరకెక్కుతాయి. డబ్బింగ్ చిత్రాలు అదనం. కానీ ఏడాదికి 52 శుక్రవారాలు మాత్రమే. ఈ లెక్కన అర్థం చేసుకోవచ్చు పోటీ ఏ స్థాయిలో ఉంటుందో. చిన్న చిత్రాల గతి ఏమిటో..

అలాంటి ఒక జఠిలమైన వ్యవస్థను దిల్ రాజు తన చేతిలో పెట్టుకున్నాడు. స్టార్ హీరోలను కూడా భయపెట్టే స్థాయికి ఎదిగాడు. కారణం దిల్ రాజు ని కాదని ముందుకు వెళ్లాలని చూస్తే థియేటర్స్ దొరకవు. థియేటర్స్ దొరక్కపోతే హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రావు. కళ్ళ ముందే వసూళ్లు కోల్పోవాల్సి ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు… కేవలం 37 థియేటర్స్ తో నేను సినిమా బిజినెస్ ని శాసించగలనా? అన్నారు.
నిజానికి ఆ 37 థియేటర్స్ ఆయనకు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఏపీలో అతిపెద్ద బిజినెస్ ఏరియాగా ఉత్తరాంధ్ర ఉంది. నైజాంతో పోటీపడగల సామర్థ్యం ఉన్న ప్రాంతం అది. 2023 సంక్రాంతికి వారసుడు, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు విడుదల అవుతుండగా… 50 శాతం థియేటర్స్ తమిళ హీరో విజయ్ సినిమాకు మరో మరో 50 శాతం బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఉత్తరాంధ్రలో కేటాయించారు. వారసుడు చిత్ర నిర్మాత దిల్ రాజు కాగా.. ఆయన సినిమా మాఫియాకు ఇది కేవలం ఒక ఉదాహరణ.

డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ గా ఏర్పడింది. ఆ సిండికేట్ కింగ్ దిల్ రాజు. ఆయన ఆదేశాల మేరకు ఈస్ట్ సత్యనారాయణ, వెస్ట్ ఎల్ వి ఆర్, గుంటూరు, కర్నూల్, నెల్లూరు యూవీ, నైజాం ఏషియన్ సునీల్ పని చేస్తారు. దిల్ రాజుకు పోటీగా మరో డిస్ట్రిబ్యూటర్ ఎదగకూడదు. అల జరగాలంటే ఇతర డిస్ట్రిబ్యూటర్స్ కొన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వకూడదు. ఇచ్చినా త్వరగా ఎత్తేయాలి. సినిమా బిజినెస్ ని ఎవరూ శాసించలేరని చెప్పే దిల్ రాజు ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నారు. చిరంజీవి, బాలయ్య ఎవరైనా దిల్ రాజుకు ఒకటే. ఎక్కువ చేస్తే తొక్కిపడేస్తాడు. అలాంటి ఒక వ్యవస్థను నిర్మించుకున్నాడు.