Thundu movie Review: OTT లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన వాళ్లకు మలయాళ సినిమాలు బాగా దగ్గరయ్యాయి. వాళ్ళ సినిమాల్లో కథ, కథనం బాగుంటాయి కాబట్టి మన వాళ్లకు నచ్చింది. అందుకే మలయాళం సినిమాలు తెలుగు భాషలోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. కాస్ట్, మిగతావన్నీ పట్టించుకోకుండా ప్రేక్షకులు కేవలం కంటెంట్ కోసమే మలయాళం సినిమాలు చూస్తున్నారు. పైగా అక్కడి మేకర్స్ డిఫరెంట్ కథలతో మనవాళ్లను మెప్పిస్తున్నారు. గిరాకీ పెరిగింది కాబట్టి ఓటీటీ సంస్థలు నేరుగా మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నాయి. ఇటీవల ఆ మలయాళ చిత్ర సినిమా నుంచి తుండు (tundu movie review) అనే పేరుతో ఓ చిత్రం తెలుగులోకి డబ్ అయింది. Netflix లో స్ట్రీమ్ అవుతోంది.
అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన బిజూ మీనన్.. దసరా చిత్రంలో విలన్ గా మెప్పించిన షైన్ టామ్ చాకో ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. మిగతావారు తెలుగువారికి అంతగా పరిచయం లేదు కాబట్టి.. వారి గురించి రాసినా పెద్దగా ఉపయోగం లేదు. ఇక కథలోకి వెళ్తే.. బేబీ (బిజూ మీనన్) కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు. అతడికి ఇంటర్ చదివే కొడుకుంటాడు. కాలేజీలో కాపీ కొట్టి, ఇన్విజిలేటర్ కు అడ్డంగా దొరికిపోతాడు. మరోసారి ఇలా చేస్తే సస్పెండ్ చేస్తామని కాలేజీ యాజమాన్యం హెచ్చరిస్తుంది. మరోవైపు బేబీకి తన పని చేస్తున్న పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు మొదలవుతాయి. అతని కంటే జూనియర్ అయిన హెడ్ కానిస్టేబుల్ షిపిన్(షైన్ టామ్ చాకో) రూలింగ్ చేస్తుంటాడు. అతడి ఆగడాలు భరించలేక బేబీ ఎలాగైనా సరే ఏఎస్ఐ కావాలని నిర్ణయించుకుంటాడు. అలా కావాలంటే డిపార్ట్మెంట్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని కొంతమంది సిబ్బంది సలహా ఇస్తారు. దీంతో అతడు డిపార్ట్మెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటాడు. ఆ సబ్జెక్ట్ ఎంతకీ అతడి బుర్రకు ఎక్కదు. దీంతో కాపీ కొట్టాలని డిసైడ్ అవుతాడు. అతడు కాపీ కొడతాడా? ఏఎస్ఐ అవుతాడా? అనేది Netflix OTT లో చూస్తే తెలుస్తుంది.
కాపీ కొట్టిన కొడుకుకు భయం చెప్పాల్సిన తండ్రి, అందులోనూ పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, కాపీ కొట్టాలనుకోవడం, దానికోసం కొడుకు సహాయం తీసుకోవడం.. ఆసక్తికరమైన అంశం. ఈ కథకే సగం మార్పులు వేయొచ్చు.. అయితే ఈ కథ చుట్టూ బలమైన సన్నివేశాలు దర్శకుడు రాసుకుంటే సినిమా మరో లెవెల్ లో ఉండేది. కానీ అలా చేయకపోవడంతో తుండు(Thundu movie review) ఒక సాధారణ సినిమాగా మిగిలిపోయింది. వాస్తవానికి ప్రభుత్వ శాఖలో పై స్థాయి ఉద్యోగుల అజమాయిషీ ఎక్కువగా ఉంటుంది. పోలీస్ శాఖలో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు.. షిపిన్ చూపిస్తున్న టెంపర్ వల్ల ఇబ్బంది పడ్డ బేబీ.. 22 ఏళ్ల వృత్తి గత జీవితంలో డిపార్ట్మెంట్ టెస్ట్ రాయడానికి నిర్ణయించుకుంటాడు. కానీ దాన్ని కూడా దర్శకుడు ఎక్కువగా చూపించలేక ఒక్క సీన్ కు పరిమితం చేశాడు.
ఇక సెకండాఫ్ లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చే పనిష్మెంట్లు, ట్రైనింగును దర్శకుడు చూపించాడు.. అయితే వాటిని ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో ఇక్కడే దర్శకుడు కథ విషయంలో దారి తప్పినట్టు కనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో విద్యావ్యవస్థను ప్రశ్నించిన దర్శకుడు.. ఆ తర్వాత పోలీస్ శాఖ వైపు మళ్ళుతాడు. ఇక కథ అక్కడ నుంచి ముందుకు సాగదు. బేబీ కొడుకు ఎంట్రీ తో.. ఇదేదో ఎక్స్ పర్ మెంటల్ కథ అనుకుంటారు. కానీ అదంతా ఉత్తిదే అని తర్వాత సందేశం తో ప్రేక్షకుడికి ఊరికే అర్థమవుతుంది. బేబీ కాపీ కొట్టడం ద్వారా… చిన్న చిన్న పోస్టుల్లో ఉన్నవారు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అవ్వాలంటే ఇలానే చేయాలేమో.. అన్నట్టుగా దర్శకుడు చెప్పాడనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ సినిమా చాలామందిని తప్పుదోవ పట్టిస్తుంది.
ఇక నటన వరంగా చూస్తే బిజూ మీనన్ ఇరగదీశాడు. అయితే అయ్యప్పనుమ్ కోషీ సినిమా రేంజ్ లో అయితే కాదు.. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడు అనుకునే అభిమానులకు ఈ సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు. దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో ఉన్నంతలో కాస్త విలక్షణంగా నటించాడు. ఈ రెండు పాత్రలు తప్ప.. సినిమాలో మిగతా వారెవరూ పెద్దగా గుర్తుండదు. కథలో గొప్ప మలుపులంటూ ఉండవు. కెమెరా పనితనం, గోపి సుందర్ నేపథ్య సంగీతం ఎఫెక్ట్ గా లేవు. స్థూలంగా చెప్పాలంటే ఓసారి కాలక్షేపానికి చూడాల్సిన సినిమా ఇది.
రేటింగ్ 2.5/5