Pithapuram: పిఠాపురంలో అదే కీలకం

2009 వరకు పిఠాపురం నియోజకవర్గం చాలా చిన్నది. కేవలం లక్ష ఇరవై వేల వరకు ఓట్లు ఉండేవి. అక్కడ 50 వేలకు పైగా ఓట్లు తెచ్చుకునేవారు విజేతగా నిలిచేవారు. కానీ 2009 తర్వాత సీన్ మారింది. నియోజకవర్గాల పునర్విభజనతో అక్కడ ఓటర్ల సంఖ్య పెరిగింది.

Written By: Dharma, Updated On : March 20, 2024 9:41 am

Pithapuram

Follow us on

Pithapuram: ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గం పై పడింది. పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తుండటమే కారణం. పవన్ ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావిస్తోంది. అందుకే అక్కడ ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. టిడిపి టికెట్ ఆశించిన వర్మ.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. అసలు పిఠాపురంలో జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ఆ కామెంట్స్ ను వైసీపీ వైరల్ చేస్తోంది. అయితే ఇప్పుడు వర్మ మెత్తబడి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పడంతో వైసిపి నీరుగారిపోయింది. మరోవైపు ఎలాగైనా పిఠాపురంలో సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు.

2009 వరకు పిఠాపురం నియోజకవర్గం చాలా చిన్నది. కేవలం లక్ష ఇరవై వేల వరకు ఓట్లు ఉండేవి. అక్కడ 50 వేలకు పైగా ఓట్లు తెచ్చుకునేవారు విజేతగా నిలిచేవారు. కానీ 2009 తర్వాత సీన్ మారింది. నియోజకవర్గాల పునర్విభజనతో అక్కడ ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండు లక్షల 20 వేలకు పైగా ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. మెజారిటీ ఓట్లు మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందినవే. దాదాపు 91 వేలకు పైగా కాపు ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు యాదవ, బీసీలు, ఎస్సీ సామాజిక వర్గం వారు సైతం ఉన్నారు. అయితే కాపు ఓటర్లు అధికంగా ఉండడంతో పవన్ కు అనుకూలంగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఆమెకు బంధుగణం ఉంది. ఆమె సైతం కాపు ఓటర్లు తనను ఆదరిస్తారని నమ్మకం గా ఉన్నారు. ఆపై ఇతర సామాజిక వర్గాల్లో సైతం పట్టు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఠాపురం విషయంలో నిర్లక్ష్యం వద్దని.. టిడిపి శ్రేణులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. మొత్తానికైతే ఎన్నికలు సమీపిస్తున్న కొలది పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారనుంది. అక్కడ పవన్ ను ఓడించడానికి వైసిపి పోల్ మేనేజ్మెంట్ పై కూడా దృష్టి పెట్టింది. పంచాయతీల వారీగా నాయకులకు టార్గెట్లు పెడుతోంది. అయితే అటు కాపు సామాజిక వర్గం, ఇటు టిడిపి బలంతో భారీ మెజారిటీతో గెలుస్తానని పవన్ ధీమాతో ఉన్నారు. ఎప్పటికప్పుడు లెక్కలు మారుస్తున్నారు. కొత్త లెక్కలు కడుతున్నారు. మరి ఎన్నికల్లో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.