Vijay Devarakonda: సాధారణంగా చిత్ర పరిశ్రమ అనేది శుక్రవారం ఆధారంగా నడుస్తుంది. ఒక సినిమా విజయవంతం అయితే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే పరాజయం పాలైతే కిందికి తోసేస్తారు. ఎందరో కళాకారులు ఎత్తు పల్లాలు చూసినవాళ్లే. దానికి ఎవరు కూడా మినహాయింపు కాదు. అయితే ప్రస్తుత వర్థమాన నటుల్లో ఎంతో క్రేజ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా పరిశ్రమను తన వైపు తిప్పుకున్న నటుడు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఇతడి చిత్రం లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ స్థానంలో ఇంకొకరు ఉంటే పెట్టే బేడా సర్దుకుని వెళ్లేవారేమో. కానీ యూత్లో విజయ్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. కానీ ఈసారి వచ్చిన ఆఫర్లు టాలీవుడ్ నుంచి కావు.

ఫ్యాన్ ఫాలోయింగ్
విజయం, పరాజయంతో సంబంధం లేకుండా విజయ్ స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. తొలి చిత్రంతోనే తన నటనతో అలరించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. లైగర్ వివాదం నేపథ్యంలో దానికి చాలా దూరంగా ఉన్నాడు. ఫలితంగా పూరి జగన్నాథ్ తో తీయాల్సిన జనగణమనను కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇక తాజా ఖబర్ ప్రకారం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా కోసం చర్చలు జరిపారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెల్లడి కాలేదు.
బాలీవుడ్లో అవకాశాలు
అయితే ఈ హీరో కి రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ కు చెందిన ఇద్దరు నిర్మాతలు విజయ్ ని సంప్రదించారని తెలుస్తోంది. కరణ్ జోహార్ ఓ దర్శకుడి తో ఇటీవల విజయ్ ని కలిసి ఓ సినిమా గురించి మాట్లాడారని సమాచారం. మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ విజయ్ తో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విజయ్ నుంచి రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే ఒక సినిమా లో నటిస్తున్నాడు.. ఇందులో అతని పక్కన సమంత నటిస్తోంది. ప్రేమ కథా చిత్రం గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

రష్మిక తో మూడోసారి
ఇక విజయ్, రష్మిక సంబంధం అందరికీ తెలిసిందే. గీత గోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరూ బాగా దగ్గరయ్యారని టాక్. ఇటీవల మాల్దీవులు ట్రిప్ కూడా వెళ్లొచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చిన పరుశురాం.. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ను రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరశురాం బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పట్టాలెక్కెందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో.. దానికంటే ముందు విజయ్, రష్మీక తో సినిమా తీయాలని అనుకుంటున్నాడు. గతంలో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్, రష్మీక నటించారు. ఇప్పుడు పరుశురాం సినిమాతో మూడోసారి జోడి కట్టేందుకు సిద్ధమయ్యారు.