హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 10 తేదీన జరిగే ‘మా’ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. అటు అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు హోరాహోరీగా తలపడుతున్నారు. ‘మా’లో లోపాలను పూర్తిగా చక్కబెట్టి అభివృద్ధి చేస్తానని ప్రకాశ్‌రాజ్, సొంత డబ్బులతో మా భవన నిర్మాణం, ప్రత్యేక మేనిఫెస్టోతో మంచు విష్ణు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తన తనయుడు మంచు విష్ణు ప్యానెల్‌కి ఓటేసి అధ్యక్షుడిగా గెలిపించాలని మా సభ్యులను డైలాగ్ కింగ్ మోహన్ బాబు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ లేఖని విడుదల చేశారు.
‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యత అని, ‘మా’ అధ్యక్ష పదవిలో తాను ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టానని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదంటారు. కానీ, చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థని స్థాపించిన నాటి నుంచి, ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు తన నిర్మాణంలో పూర్తి అయ్యాయని, ఎందరో నూతన టెక్నిషియన్లకి, కళాకారులకి అవకాశాలు ఇచ్చానని తెలిపాడు. ఎంతోమంది పేద పిల్లలకి, మరణించిన సినీ కళాకారుల పిల్లలకి తన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి, వాళ్లు గొప్పస్థాయికి చేరేలా మార్గం చూపానని, దాన్ని ఎప్పటికి కొనసాగిస్తానని వెల్లడించారు.
ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడని. తన బిడ్డ తన క్రమశిక్షణకి, తన కమిట్‌మెంట్‌కి వారసుడన్నారు. తను మనకు దగ్గరగా ఉంటాడని, మన ఊళ్లోనే ఉంటాడని, ఏ సమస్య వచ్చినా మీ పక్కనే అండగా నిలపడతాడని నేను మాటిస్తున్నాను అని తెలిపాడు. మీరు మీ ఓటుని విష్ణుకు, అతని ప్యానెల్‌కి వేసి సమర్థవంతమైన పాలనకి మార్గం చూపాలని, ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతిసారీ ‘నేనున్నాను’ అని ముందు నిలబడ్డ దివంగత దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డని అని ఆ లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు.