
CM KCR New Scheme: తెలంగాణ ప్రజలపై కేసీఆర్ మరో వరం కురిపించారు. మనిషికి కావలసిన కనీస అవసరాన్ని గుర్తించి గురిచూసి కొట్టారు. తిండికి రేషన్ ఇస్తున్నాడు.. గుడ్డ కోసం ‘బతుకమ్మ చీరలు’ ఇస్తున్నాడు.. గూడు కోసం ‘డబుల్ బెడ్ రూం’లు ఇచ్చాడు. కానీ ఇది చాలా వ్యయంతో కూడినది.. పైగా స్థలం కొరత.. సో ఏం చేయాలి? ఎలా చేయాలి అన్నది బాగా ఆలోచించి.. తన మదిలో మెదిలిన ఓ గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు.. అదే ‘సొంతింటి పథకం’.
గ్రామాల్లో చాలా మందికి రెండు మూడు ఐదు గుంటల వరకూ ఖాళీ స్థలాలు బోలెడంత ఉంటుంది. కానీ ఇళ్లు కట్టుకోవడానికి తగినంత ఆర్థిక స్థోమత ఉండదు. ఇప్పుడు వారందరి కష్టాలు తీర్చడానికి ఈ అద్భుత పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. సొంత స్థలం కలిగిన వారికి ‘ఇళ్లు ’ నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఈ పథకంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కానీ నియోజకవర్గానికి కొందరికే అని కేసీఆర్ మెలిక పెట్టిన తీరుతో అందరూ హతాషులవుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో జరిగిన చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ పనితీరును కొందరు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ తో పోలిస్తే వెయ్యి రెట్లు మెరుగ్గా పనిచేస్తున్నాం. సంక్షేమ పథకాలు తెచ్చాం. ప్రజలసమస్యలు తీర్చడంలో ముందున్నాం. రాష్ర్టం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే పనిలో భాగంగా అన్ని మతాలను సమదృష్టితో చూస్తున్నాం. బోనాల పండుగలకు రూ.15 కోట్లు ఖర్చు చేసి అన్ని ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాం.
అలాగే యాదాద్రి ఖ్యాతిని పెంచాం. యాదగిరి గుట్టలో జరుగుతున్న పనులు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం పెంచే క్రమంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాష్ర్ట ప్రజల తలసరి ఆదాయం పెంచాం. కేంద్రంతో పోల్చుకుంటే మనమే మంచి స్థానంలో ఉన్నాం. ఏపీ కూడా వెనుకబడి ఉంది. వారి తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు కాగా మనది రూ.2.37 లక్షలుగా ఉంది. దీంతో మనం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నామో తెలియడం లేదా అని ప్రశ్నించారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు రావడం లేదు. కానీ మనమే కేంద్రానికి ఇస్తున్నాం. దేశ ఖజానాకు నిధులు సమకూర్చే నాలుగైదు స్టేట్లలో మనది ఒకటి కావడం గమనార్హం. ఇంత జరుగుతున్నా బీజేపీ నేతలు మాత్రం రాష్ర్టంపై బురదజల్లే పనులు చేయడం దారుణం. మనకు రావాల్సిన వాటా మనకు ఇస్తే ఇంకా అభివృద్ధి చేసుకుంటాం.
సొంత భూమి కలిగిన వారికి ఇల్లు కట్టుకునే పథకాన్ని పరిశీలిస్తాం. నియోజకవర్గానికి వెయ్యి మందికి అవకాశం కల్పించి త్వరలోనే ఆ పథకానికి విధి విధానాలు ఖరారు చేస్తాం. దీంతో సామాన్యులకు లాబం చేకూరనుంది. సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తాం. ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకులను విధుల్లోకి తీసుకునే అంశంపై ఆలోచిస్తాం. అసెంబ్లీ వేదికగా పలు విషయాలపై సీఎం స్పందించారు. ప్రభుత్వ తీరును సభ్యులకు తెలియజేస్తూ ప్రసంగించారు.