Mohan Babu: గత రెండు మూడు రోజులుగా మంచు కుటుంబంలో జరిగిన వివాదం ఇండస్ట్రీ లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనోజ్ సృష్టించిన హంగామా కారణంగా మోహన్ బాబు సహనం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తండ్రి పై పోలీస్ స్టేషన్ లో కేసు వెయ్యడం, తనకి రక్షణ లేదు, సీనియర్ సిటిజెన్ ని, నా కొడుకు నుండి నన్ను కాపాడండి, వాడిని నా ఇంటి నుండి తరిమేయండి అంటూ పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేయడం, మంచు మనోజ్ కూడా ఇంటిని ఖాళీ చేసి వెళ్లి, మళ్ళీ తన కూతురు కోసం తిరిగి వచ్చినప్పుడు సెక్యూరిటీ అడ్డుకోవడం, మంచు మనోజ్ గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు దూసుకెళ్లడం వంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనలు జరిగిన తర్వాత ఆవేశం లో ఉన్న మోహన్ బాబు అదుపుతప్పి కవరేజ్ కోసం వచ్చిన మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.
దీనిపై జర్నలిస్టులు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ధర్నాలు చేసారు. మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు కూడా వేశారు. దీనిపై FIR నమోదు చేసిన తెలంగాణ పోలీసులు మోహన్ బాబు ని నేడు అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లగా, పరారీ లో ఉన్నట్టు తెలిసింది. ఆయన్ని వెతకడం కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఒక గాలించారు. కానీ మోహన్ బాబు ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆయన ఇండియన్ లో లేడని, దేశం వదిలి వెళ్ళిపోయి ఉంటాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు ఇటీవలే దుబాయి లో స్థిరపడిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానం ద్వారా ఆయన దుబాయి కి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోపక్క నిన్న రాత్రి ఆయన జరిగిన ఈ ఘటనపై ఒక ఆడియో రికార్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కావాలని చెయ్యలేదని, క్షణికావేశం లో జరిగిపోయిందని, మీడియా రిపోర్టర్ మైక్ నా ముఖం మీద పెట్టడంతో గాయం అయ్యిందని, కన్ను బాగా వాచింది అంటూ ఆడియో ని విడుదల చేసాడు. అంతే కాకుండా నేడు ఉదయం కూడా ఆయన ట్విట్టర్ ద్వారా గాయపడిన మీడియా రిపోర్టర్ కి క్షమాపణలు చెప్తూ ఒక లెటర్ ని విడుదల చేసాడు. ఇంత చేసిన తర్వాత ఆయన ఆచూకీ అకస్మాత్తుగా దొరకకపోవడం గమనార్హం. ఆయన వేసిన ట్వీట్ ఆధారంగా లొకేషన్ ని ట్రేస్ చేసి ఆయన ఎక్కడున్నాడో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మోహన్ బాబు నెంబర్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఈ ఘటనపై మోహన్ బాబు కచ్చితంగా అరెస్ట్ అవ్వక తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.