బాగా ఉన్న కుటుంబంలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు కీరవాణి. కానీ, ఆర్థికంగా చితికి పోయింది ఆ కుటుంబం, కారణం సినీ పరిశ్రమ. సినీ పరిశ్రమలోకి ఏమి తెలియకుండానే వచ్చి సినిమాలు తీసి చేతులతో పాటు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని విధంగా తమ ఆశలను కూడా పూర్తిగా కాల్చేసుకుంది కీరవాణి కుటుంబం. దాంతో ఆర్థికంగా ఇబ్బందులతో పాటు ఆకలి బాధలతో తొలినాళ్లలో కీరవాణి కుటుంబం ఎన్నో కష్టాలు పడింది.
అలాంటి పరిస్థితుల్లో తన బాల్యాన్ని గడిపిన కీరవాణికి కష్టం విలువ తెలుసు, ప్రతిభ గొప్పతనం తెలుసు. అందుకే ఆయన తన ప్రతిభకు కష్టాన్ని జోడించి ముందుకు సాగారు. ఓ దశలో కీరవాణి సంపాదనతోనే ఆ కుటుంబం బతికి బయట పడింది. నిజానికి చిన్న వయసులోనే కీరవాణి ఇన్ని కష్టాలు అవమానాలు పడ్డారు కాబట్టే.. ఆయన ట్యూన్స్ లో లోతు ఉంటుంది, ఆయన గాత్రంలో ఎమోషన్ ఉంటుంది.
కీరవాణి సంగీత దర్శకుడిగా మారకముందు చక్రవర్తి దగ్గర 60 చిత్రాలకు పనిచేశారు. ఇక తానూ పాటలను అద్భుతంగా కంపోజ్ చేయగలను అని నమ్మకం కలిగిన తర్వాత కూడా, ఆయన అవకాశాల కోసం తిరగలేదు. సాహిత్యంలోనూ మెళకువలు నేర్చుకోవాలనే తపనతో గేయ రచయిత వేటూరి వద్ద శిష్యరికం చేసి.. సాహిత్యానికి ఉన్న అర్ధాన్ని, ఆ అర్థంలోని పరమార్ధాన్ని అర్ధం చేసుకున్నారు.
అందుకేనేమో పాట కంపోజ్ చేస్తే.. పదాలు వినసొంపుగా ఉండాలని కీరవాణి పట్టుపట్టేది. కీరవాణి ‘మనసు మమత’తో వెండితెరకు సంగీత దర్శకుడిగా పరిచయమైనప్పటికీ.. ‘సీతారామయ్య గారి మనవరాలు’తోనే తన సంగీతం గొప్పతనాన్ని తెలుగు వాళ్లకు పరిచయం చేశాడు. అయితే, ‘క్షణక్షణం’ సినిమా విజయం తర్వాతే, కీరవాణికి భారీ చిత్రాల ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక అప్పటి నుండి ఆయన విజయ పరంపర గురించి అందరికీ తెలిసిందే.