మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రస్తుత కార్యవర్గం కాలం ఇంకా ముగియలేదు. ఎన్నికలు ఎప్పుడో సెప్టెంబర్లో జరగనున్నాయి. కానీ.. రేపో మాపో పోలింగ్ అన్నంత హడావిడి జరుగుతోంది తెలుగు చిత్ర పరిశ్రమలో! దీంతో.. మరోసారి హోరాహోరీ పోరు ఖాయమని తేలిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఆధిపత్య పోరు గురించి అందరికీ తెలిసిందే. అయితే.. మరీ ఇంతలా విస్తరించడానికి మెగా రీజన్ ఉందని అంటున్నారు.
ఈ సారి మా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. మరోవైపు మంచు విష్ణు బరిలోకి దిగగా.. మధ్యలో తానూ ఉన్నానంటూ వచ్చేశారు జీవిత. అయితే.. ఇందులో ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు పలుకుతోంది. ఈ విషయాన్ని నాగబాబు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. మంచు విష్ణుకు బాలకృష్ణ తదితరులు సపోర్టుగా ఉన్నారు. దీంతో.. గెలుపు ఎవరిదోననే ఆసక్తి ఇప్పుడే ఏర్పడింది.
అయితే.. నిజానికి మా సంస్థ అనేది పేద కళాకారుల బాగుకోసం ఉద్దేశించిన సంస్థ. ప్రస్తుతం అయితే.. పెద్దగా నిధులు కూడా లేవని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇంత పోరాటం ఎందుకంటే.. మా అధ్యక్ష పదవి అనేది హోదాకు సింబల్ కావడం ఒకెత్తయితే.. గెలిచినవారు, గెలిపించిన వారు ఇండస్ట్రీలో తమకున్న పట్టును చాటుకునేందుకు అసలైన వేదికగా మారుతోంది. ప్రతిసారీ మెగా కాంపౌండ్ మద్దతు ఇచ్చినవారే.. గెలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఇదే ఫలితాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారు ప్రత్యర్థులు.
కాగా.. ఈ సారి పోరు వెనుక ఓ బలమైన కారణం ఉందనే ప్రచారం సాగుతోంది. మా సంస్థకు సొంత భవనం లేదు. దాన్ని నిర్మించాలనేది ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. ఇది మరీ అంత పెద్ద విషయం ఏమీ కాదు. కానీ.. ఆ భవనానికి పెట్టే పేరు విషయంలోనే పంచాయితీ మొదలైందని అంతర్గత ప్రచారం చెబుతోంది. మా ఆర్గనైజేషన్ ఏర్పాటులో చిరంజీవి సహకారం ఎంతో ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆయన వల్లే పెన్షన్లు అందుతున్నాయని భావించే పేద కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు భవన నిర్మాణానికి అవసరమయ్యే 25 – 30 కోట్లలో తనవంతు వాటా కూడా గట్టిగానే ఇచ్చేందుకు చూస్తున్నారట. ఈ క్రమంలోనే.. మా భవనానికి మెగా పేరు పెట్టే ఆలోచన చేస్తున్నారట. మరో వర్గం మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్టాలని తెరపైకి తెస్తోందట.
మూణ్నెల్ల ముందు నుంచే మా పోరాటం హాట్ హాట్ గా మారిపోవడం వెనుక అసలు కారణం ఇదేనని చెబుతున్నారు. మరి, ఇది ఎన్నికల నాటికి ఏ రూపం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఎవరు గెలిచినా.. మా భవనానికి పెట్టే పేరు విషయంలో ఎలాంటి పంచాయితీ రచ్చకెక్కుతుందోనని కామెంట్లు చేస్తున్నారు ఇండస్ట్రీలోని పలువురు. అంతిమంగా ఏం జరుగుతుందన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.