Manchu Vishnu: ఎదుటోళ్లకు నీతులు చెప్పడానికి కమ్మగా ఉంటుంది. అవే నీతులు పాటించాలి అంటేనే వ్యవహారం తేడా కొడుతోంది. “మా” ఎన్నికల నేపథ్యంలో చాలా మంది పెద్దోళ్లు మైక్ దొరకగానే బోలెడు నీతులు గుమ్మరించారు. వాళ్ళల్లో మోహన్ బాబు కూడా ఒకరు. ఎప్పుడు మైక్ చేతికి వచ్చినా.. మోహన్ బాబు స్పీచ్ లో సగం పాయింట్లు నీతి వ్యాఖ్యలే ఉంటాయి. అయితే, విచిత్రంగా అదే మోహన్ బాబు మైక్ లేని సమయంలో పచ్చి బూతులు తిడుతూ ఉంటారు.

ఈ మధ్య కాలంలో ఆ తిట్లకు ఎక్కువ బలి అయింది నటుడు బెనర్జీనే. ఇక మోహన్ బాబు తరుచూ చెప్పే మాట. అనవసరంగా మీడియా ముందుకు ఎవరూ వెళ్లవద్దు అని. ముఖ్యంగా మా సభ్యులను ఉద్దేశించి మోహన్ బాబు ఈ మాట ప్రతీ సారి దంచుతూ ఉంటారు. అయితే, ముందుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది మాత్రం మంచు విష్ణునే. ఎక్కడ మైక్ దొరికితే అక్కడకు వెళ్లి తనదైన శైలిలో స్పీచ్ లు ఇస్తున్నాడు విష్ణు.
ఎందుకో తెలియదు గానీ, ఈ మధ్య కాలంలో విష్ణులో చాలా మార్పులు వచ్చాయి. రోజుకొక మాట చెబుతూ వస్తున్నాడు. నిజానికి “మా” ఎన్నికల పై అనేక వివాదాస్పద అంశాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో… విష్ణు నిన్న మాట్లాడుతూ ఇక నుంచి తన తండ్రి మాటను జవదాటను అని, ‘మా’ రాజకీయాలపై అసలు మీడియాతో మాట్లాడను అని సగర్వంగా చెప్పుకొచ్చాడు.
కట్ చేస్తే.. మరుసటి రోజే మీడియా సమావేశం పెట్టాడు. అసలు మాట ఇచ్చిన రెండు రోజుల్లోనే మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది ? విష్ణు గెలిచిన తన ప్యానల్ సభ్యులందర్నీ తీసుకుని శ్రీవారి దర్శనం వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు, అక్కడ కూడా మీడియాతో మాట్లాడాలా ? పైగా అన్ని వివాదాస్పద అంశాల పై విష్ణు వివరంగా వివరణ ఇవ్వడం విశేషం.
చూడబోతే.. ఇక విష్ణు మీడియా మీటింగ్ లు లేకపోతే బోర్ గా ఫీల్ అవుతాడేమో. మొత్తానికి విష్ణు మీడియా ప్రేమలో పడ్డాడు. పనిలో పనిగా ‘మా’ బైలాను కూడా మారుస్తాను అంటూ ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక సీసీ టీవీ ఫుటేజీ వివాదం గురించి కూడా విష్ణు మాట్లాడాడు. సరే విష్ణు ఏదో ఆత్రుతలో ఏదోకటి మాట్లాడాడు అనుకుంటే సరే.. కానీ బాబూమోహన్ లాంటి వాళ్ల చేత కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై గట్టి విమర్శలు చేయించడమే విడ్డూరం.