Manchu Manoj: మంచు మనోజ్ మోహన్ బాబు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వరుస ప్లాప్స్ తో హీరోగా వెనుకబడి పోయాడు. అదే సమయంలో పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ రీసెంట్ గా భూమా మౌనిక ను పెళ్లి చేసుకొని ఇప్పుడిప్పుడే పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. ఇదే సమయంలో తన లైఫ్ లో కొత్త చాప్టర్ ఓపెన్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
మంచు ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో టాప్ పొలిటికల్ లీడర్స్ తో మంచి సంబంధాలే ఉన్నాయి కానీ, వాళ్ళకి మాత్రం పాలిటిక్స్ కలిసిరాలేదని చెప్పాలి. కానీ ప్రతిసారీ ఎన్నికల ముందు మంచు ఫ్యామిలీ హడావిడి మాత్రం రాష్ట్రంలో కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అదే కోవలో మంచు మనోజ్ అతని భార్య కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలవటం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఇది కచ్చితంగా పొలిటికల్ మీటింగ్ అని వినిపిస్తున్న కానీ మనోజ్ మాత్రం జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మనోజ్ – మౌనిక ల వివాహం జరిగిన నాటి నుంచి వారి పొలిటికల్ ఎంట్రీ పై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబుతో భేటీ తో ఇది నిజమనే తెలుస్తుంది. భేటీ అనంతరం మనోజ్ మాట్లాడుతూ మా పెళ్లి తర్వాత చంద్రబాబు గారిని కలిసి ఆశీస్సులు తీసుకోవాలి అనుకున్నాను, ఆయనకు మా కుటుంబం అంటే ఎంతో ఆప్యాయత ఉంది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఈ రోజు ఉదయం ఆయన ఫోన్ చేసి పిలవడంతో వచ్చి కలిశాం. మా అబ్బాయి పుట్టినరోజు కూడా ఉండటంతో ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఇక రాజకీయాలు గురించి నేను మాట్లాడాను. సమయం వచ్చినప్పుడు మౌనిక మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు..
భూమా మౌనిక వాళ్ళ అక్క భూమా అఖిల ప్రియ ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి టీడీపీ లోనే ఉన్నారు. వాళ్ల కజిన్ భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా టీడీపీ లోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ లోను, నంద్యాలలో మంచి పట్టు ఉంది. వీటిని కేంద్రంగా చేసుకొని భూమా ఫ్యామిలీ రాజకీయాలు చేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా అఖిల ప్రియ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాటిపై చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.
అదే సమయంలో అక్క చెల్లెళ్లకు కూడా కొన్ని విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీనితో అక్క స్థానాన్ని భర్తీ చేయడానికి మౌనిక రంగప్రవేశం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో మౌనిక రాజకీయాల పట్ల ఆసక్తి చూపించిన కానీ అఖిలప్రియ ఒప్పుకోలేదని ఆళ్లగడ్డ లో వినిపిస్తున్న టాక్. ఇక ఇప్పుడు మంచు మనోజ్ రూపంలో తనకు సపోర్ట్ ఉండటంతో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మౌనిక భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క మంచు విష్ణు వైసీపీ అధినేత జగన్ కు సమీప బంధువు కావటమే కాకుండా వైసీపీ కి మద్దతుగా ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి విష్ణు కు మనోజ్ కి మధ్య ఉన్న విభేదాలు మీడియాకెక్కిన విషయం తెలిసిందే. దీంతో మనోజ్ ఇప్పుడు టీడీపీ కి మద్దతు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మంచు మనోజ్ ఒకసారి జగన్ కు, మరోసారి పవన్ కళ్యాణ్ ను కలిసిన విషయం తెలిసిందే. మరి తమ రాజకీయ ప్రయాణాన్ని ఏ పార్టీ నుంచి ప్రారంభిస్తారో చూడాలి.