Polavaram Project: ఏపీపై కేంద్రం వైఖరి మారినట్టుంది. అందుకే సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే దీని వెనుక కారణాలు ఎలాంటివైనా.. ఏపీ ప్రయోజనాలకు మాత్రంపెద్దపీట వేస్తుండడం శుభపరిణామం. ముఖ్యంగా ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వ్యయం పై కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా దిగుస్తోంది. ఇంతకాలం రకరకాల కొర్రీలతో కాలం వెల్లదీసిన కేంద్రం.. ఇప్పుడు అన్నింటిపైనా స్పష్టతనిస్తోంది. తాగునీటి కోసం చేస్తున్న వ్యయాన్ని కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడుతోంది.
సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం అంటే కీలక నిర్మాణాలే కాదు. నిర్వాసితులకు పునరావాసం,పరిహారం, నీరు తరలించే కాలువలు.. ఇలా అన్నింటినీ కలిపే ప్రాజెక్టు అని అంటారు. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో పునరావాసం ఖర్చులతో సంబంధమే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన నిర్మాణాలతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అయితే వీటిపై కేంద్రం నుంచి తాజాగా సానుకూల ప్రకటనలు రావడం విశేషం.
తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వ్యయాన్ని రియంబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర జల శక్తిమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోనే స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఖర్చును రియంబర్స్ చేస్తామని ప్రకటించారు.
అయితే పోలవరంలో నిర్వాసితులకు పరిహారము, పునరావాసం, ప్యాకేజీయే అసలు సమస్య. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించగలిగితే ప్రాజెక్టుకు కీలక ముందు అడుగు పడినట్టే. అసలు ఏ ప్రాజెక్టుకు అయినా పునరావాసం ఖర్చులే చాలా అధికము. డ్యాం నిర్మాణం ఒక ఎత్తు అయితే పునరావాసం ఖర్చులు మరో ఎత్తు. పునరావాసానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబెట్టగలిగితే పోలవరం జీవనాడి సాకారం మరెంత దూరం లో లేదు.