Homeక్రీడలుHCA: హెచ్‌సీఏ ప్రక్షాళన.. ఇన్నాళ్లకు కర్రుకాల్చి వాత

HCA: హెచ్‌సీఏ ప్రక్షాళన.. ఇన్నాళ్లకు కర్రుకాల్చి వాత

HCA: అంతా తమ కంట్రోల్ లోనే ఉంది అన్న భ్రమతో విర్రవీగుతున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్.సీఏ) కు జస్టిస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏక సభ కమిటీ ఓ రేంజ్ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్న 57 క్లబ్బుల పై జస్టిస్ నాగేశ్వరరావు వేటు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతోపాటుగా హెచ్.సీఏ ఎన్నికలలో ఒక దఫా లేక మూడు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి ఆ సదరు క్లబ్బులు మరియు వాటి ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం కూడా విధించడం జరిగింది. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 14న హెచ్.సీఏ ఎపెక్స్ కమిటీ లో
నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసం సుప్రీం కోర్ట్ జస్టిస్ నాగేశ్వరరావు కమిటీని నియమించింది. దీంతో ఎలాగైనా
హెచ్.సీఏను క్రమబద్ధీకరించాలి అని నిర్ణయించుకున్న జస్టిస్ నాగేశ్వరరావు.. గతంలో సుప్రీంకోర్టు నియమించినటువంటి పర్యవేక్షక కమిటీ అందించిన నివేదికను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ప్రస్తుతం 80 క్లబ్బులను తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి 12 మంది సభ్యులు ,వారి కుటుంబ సభ్యులు నేరుగా ,పరోక్షంగా హెచ్.సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు పర్యవేక్షిక కమిటీ తమ నివేదికలో పేర్కొంది.

జీహెచ్ఎంసీకి చెందినటువంటి క్లబ్బులు కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు కూడా ఈ నివేదికలో తెలిపింది. దీంతో ఈ విషయంపై సుదీర్ఘ విచారణ జరిపినటువంటి జస్టిస్ నాగేశ్వరరావు నివేదికలో పేర్కొన్నటువంటి క్లబ్ అధ్యక్షులు ,కార్యదర్శులు, ప్రతినిధుల నుంచి పూర్తి వివరణ సేకరించారు.

కొందరు వ్యక్తులు నిబంధనకు విరుద్ధంగా బహుళ క్లబ్స్ ను కలిగి ఉండటానికి గుర్తించడంతో జస్టిస్ నాగేశ్వరరావు వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇలా విరుద్ధంగా ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి 57 క్లబ్బుల పై అనర్హత ముద్ర వేయడం జరిగింది. రానున్న ఎన్నికలలో ఈ క్లబ్బులు తరఫున ఎవరు పాల్గొనడానికి వీలు లేదు, అలాగే వీరికి ఓటు హక్కు వినియోగం పై కూడా నిషేధం విధించడం జరిగింది.
దీంతో రాబోయే ఎన్నికలలో హెచ్.సీఏ అధ్యక్ష, కార్యదర్శి తో పాటు ఇతర అత్యున్నత పదవుల పై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది అనూహ్యంగా ఎన్నికలకు దూరమయ్యారు.

గతంలో టీం ఇండియాకు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు లాంటి ప్రసిద్ధ క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం ప్రస్తుతం అంతర్గత వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. జట్టు ఎంపిక దగ్గర నుంచి వనరుల వరకు ప్రతి విషయంలోను ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న హెచ్.సీఏ కు ఇన్నాళ్లకు తగిలిన ఎదురు దెబ్బ ఇకనైనా ఇటువంటి అంతర్గత కలహాలను ఆపుతుందేమో అని అందరూ అభిప్రాయపడుతున్నారు. క్రికెటర్లను ప్రోత్సహించి దిశా నిర్దేశం చేయాల్సినటువంటి అసోసియేషన్ పెద్దలు కేవలం తన పదవులను కాపాడుకోవడానికి పరితపిస్తున్నారు. ఏళ్ల తరబడి అసోసియేషన్ ఉంటూ అవినీతి ఆరోపణలు, ఫండ్స్ మిస్యూజ్,ఏసీబీ కేసుల్లో ఏ1, ఏ2 గా సాధించిన ఘనత తప్ప ప్రత్యేకించి వారు చేసింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు నేతృత్వంలో కోర్టు తీసుకున్న నిర్ణయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version