‘మహేష్... ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి’ అంటుంది అష్టా చమ్మా మూవీలో హీరోయిన్ స్వాతి రెడ్డి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో.. అతడిని అమ్మాయిలు ఎంతగా ఇష్టపడతారో చెప్పేందుకు రాసిన డైలాగ్ అది. నిజమే, మహేష్ అనే పేరునే ఓ బ్రాండ్‌గా మార్చేశాడు ఘట్టమనేని నట వారసుడు. అమ్మాయిల కలల రాకుమారిడిగా.. యూత్ ఐకాన్‌గా, కుటుంబ ప్రేక్షకులను అలరించే అతిథిగా..తెలుగు చిత్రపరిశ్రమ ఏలే రాజ కుమారిడిలా అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్నాడు మహేశ్. తన పేరు చెప్పగానే వచ్చే వైబ్రేషన్స్ మొదలై 21 ఏళ్లు అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేశ్.. హీరోగా 21 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై నేటికి (గురువారం) సరిగ్గా 21 ఏళ్లు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1999 జులై 30న విడుదలైంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో సి. అశ్వినిదత్ రూ. 2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే పది కోట్లు కలెక్ట్ చేసింది. కథానాయకుడిగా మహేష్‌కు బంగారు బాటలు వేసింది. అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రితో కలిసి పలు సినిమాలు చేసిన అతను ఎంతో పరిణతితో నటించాడు. బాలీవుడ్ భామ ప్రీతి జింతా, మహేశ్ మధ్య రొమాన్స్ ఆడియెన్స్ ఆకట్టుకుంది. మణిశర్మ మ్యూజిక్ కూడా ప్లస్ అయింది.
Also Read: ‘పూజా హెగ్డే’ పై నాగ్ అసంతృప్తి !
హీరోగా ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావడంతో మహేష్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. తర్వాతి ఏడాది యువరాజు, వంశీ యావరేజ్‌గా ఆడినా.. 2001లో వచ్చిన ‘మురారి’ మహేశ్ కెరీర్ను మలుపు తిప్పింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. రెండేళ్ల తర్వాత ఒక్కడుతో కమర్షియల్ హిట్ కొట్టిన మహేశ్ మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు. ఆ వెంటనే తేజ దర్శకత్వం వహించిన నిజం మూవీ ఫ్లాప్ అయినా నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. 2003కు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన అతడు మూవీ మహేష్ స్టార్డమ్‌ను అమాంతం పెంచేసి మరో నంది అవార్డు తెచ్చిపెట్టింది. తర్వాతి ఏడాదే వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డున్నీ తిరగరాయడంతో సూపర్ స్టార్ తెలుగులో నంబర్ వన్ హీరో అయ్యాడు. కానీ, ఆ సక్సెస్‌ను కొనసాగించలేక సైనికుడు, అతిథి మూవీస్‌తో నిరాశ పరిచాడు. 2010లో ఖలేజాలో తనలోని హ్యూమర్ను బయటపెట్టిన మహేశ్ దూకుడుతో మళ్లీ జోరు పెంచాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడ్డా… బిజినెస్‌మ్యాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.. రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరూ వంటి మూవీస్‌తో దూసుకెళ్తూనే ఉన్నాడు. 44 ఏళ్లు వచ్చినా పాతికేళ్ల కుర్రాడి లుక్‌తో అలరిస్తూనే ఉన్నాడు యాక్టింగ్‌ను మరింత ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు.
Also Read: ‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !
హీరోగా 21 ఏళ్ల కెరీర్లో 26 సినిమాలు చేసిన మహేశ్‌కు రాజకుమారుడు ఎంతో స్పెషల్. అది రిలీజై 21 ఏళ్లు అయిన సందర్భంగాన్ని పురస్కరించుకొని హీరోయిన్ ప్రీతి జింతా, దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి ఉన్న ఆ మూవీ వర్కింగ్ స్టిల్ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన తొలి చిత్రాన్ని చాలా స్పెషల్‌గా మార్చిన దర్శకుడికి థ్యాంక్స్ చెప్పాడు . రాఘవేంద్రరావు కూడా మహేశ్, కృష్ణతో తీసుకున్న ఫొటోలనూ, మూవీ పోస్టర్లను ట్వీట్ చేశాడు. ‘రాజకుమారుడు కి 21 వసంతాలు… ఎన్నో మధుర జ్ఞాపకాలు… మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నాడు. ప్రస్తుతం సర్కారువారి పాట మూవీ చేస్తున్న మహేశ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం.