Mad Square Movie
Mad Square Movie : హీరో, డైరెక్టర్ తో సంబంధం లేకుండా, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా తర్వాత విడుదలైన సీక్వెల్స్ అన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాలు సృష్టించాయి. అందుకు రీసెంట్ ఉదాహరణ గత ఏడాది విడుదలైన ‘స్త్రీ 2’, ‘పుష్ప 2’. సీక్వెల్స్ ని మన ఆడియన్స్ ఇంతలా ఆదరిస్తున్నారు కాబట్టే మేకర్స్ సీక్వెల్స్ తియ్యడం పై అమితాసక్తిని చూపిస్తున్నారు. అలా మన టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ ఇది. అందులో కాలేజ్ లైఫ్ చూపిస్తే, ఇందులో లడ్డు పెళ్లి ఈవెంట్ ని ఆధారంగా చేసుకొని జరిగే సంఘటనలను చూపించారు.
Also Read : అనుకున్న తేదీ కంటే ముందుగానే ‘మ్యాడ్ స్క్వేర్’..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్!
టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా అద్భుతంగా పేలాయి. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు అనేది వాస్తవం అని చెప్పొచ్చు. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టి మూడు రోజులైంది. అన్ని టాప్ థియేటర్స్ లోనే బుకింగ్స్ ప్రారంభించారు. ఒక్క AMB మాల్ షోస్ తప్ప, మిగిలిన షోస్ కి కనీస స్థాయి ఆక్యుపెన్సీ లేదు. అంతే కాదు, బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం ఇంకా ట్రెండింగ్ లోకి రాలేదు. సినిమా విడుదలకు సరిగ్గా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది, అయినప్పటికీ ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేయాలని అనుకున్నాడు నిర్మాత నాగవంశీ.
కానీ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి, ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉంటే, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. సినిమా విడుదలకు మూడు రోజులకు ముందే ఈ చిత్రానికి బుకింగ్స్ ద్వారా లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే నాలుగు లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ రెండు ప్రాంతాల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది?, ఎక్కడ తేడా జరిగింది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మన రాష్ట్రాల్లో నాగవంశీ(Naga Vamsi) సెకండ్ హాఫ్ సిల్లీ స్టోరీ అంటూ చేసిన కామెంట్స్ ప్రభావం బుకింగ్స్ మీద పడిందా అనే అనుమానం కలుగుతుంది.