అదృష్టం బాగుండి, సినిమా ఇండస్ట్రీ మళ్ళీ నిలబడి సినిమాల రాకతో తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిన.. ఓవర్ సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యే వరకూ నిర్మాతలకు నష్టాలు తప్పనట్టే. సరే ఒకవేళ అన్ని ఓపెన్ అయినా మార్కెట్ రేట్లు మళ్లీ మామూలు అవుతాయా అంటే అది అనుమానమే. దీనికి తోడు పెరిగిన హీరోల రెమ్యూనిరేషన్లను తగ్గించడం ఎవరి వల్ల అవుతుంది ?
ఇలా అనేక ప్రశ్నల నడుమ దసరా సీజన్ కోసం భారీ సినిమాలను సన్నద్ధం చేస్తున్నారు మేకర్స్. చిన్నాచితకా సినిమాలకు ఎలాగూ జీవితాలు లేవని ఇప్పటికే తేలిపోయింది. కనీసం, ఓటీటీ సంస్థలు కూడా చిన్న సినిమాలను కొనడానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇలాంటి కష్ట కాలం నుండి టాలీవుడ్ ఈజ్ బ్యాక్ టు నార్మల్ అనేది ఈ ఏడాది జరుగుతుంది అని ఎలా నమ్మగలం ? ఎలా ఊహించగలం ?
ఒకప్పుడు భారీ కలెక్షన్స్ ను కళ్ల చూసిన పెద్ద హీరోల సినిమాలకు పెట్టుబడి పెరిగినట్టుగా మార్కెట్ పెరగలేదు. నిజానికి బ్లాక్ బస్టర్ జాబితాలోకి చేరిన సినిమాలకు కూడా నిర్మాతలకు పెద్దగా లాభాలు రావడం లేదు అంటే.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఏ స్థితిలో ఉండే అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఎందుకు పెద్ద సినిమాలకు అదనపు బడ్జెట్ పెట్టి నిర్మాత నష్టపోవాలి ?
అందుకే ఇకనైనా మార్కెట్ అంటూ డిమాండ్ చేసే హీరోలను వదిలిపెట్టి.. చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసి లాభాలు పొందాలనే ఆలోచన ప్రతి నిర్మాతకు రావాలి. రాబోయే రోజుల్లో కంటెంట్ ఉంటేనే సినిమాలను చూస్తారు. ప్లాప్ సినిమాలు ఢమాల్ అనక తప్పదు. అందుకే నిర్మాతలు హీరో డేట్లు ఇచ్చాడు అని ఎడాపెడా నానా చెత్తను చుట్టేసి థియేటర్ల మీదకు వదిలితే ఎలాంటి ఉపయోగం ఉండదు, పైగా బోలెడు నష్టాలుంటాయి. కాబట్టి నిర్మాతలు మారండి, ఆలోచనను మార్చుకోండి.