నటీనటులు: అభి, సోనాక్షి, రామరాజు తదితరులు.
దర్శకత్వం : శ్రీ నారాయణ
సంగీతం: సన్నీ మాలిక్
స్క్రీన్ ప్లే: శ్రీ నారాయణ
పాటలు : లక్ష్మణ్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరా మెన్ : మహి
నిర్మాతలు : మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ
శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న చిత్రం ‘@లవ్’. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ :
గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథగా మొదలవుతుంది ఈ చిత్ర కథ. ఎమ్మెల్యే శర్మ (రామరాజు) తన కూతురు విందు, రామ్ అనే గిరిజన యువకుడిని ప్రేమించిందని తెలిసి.. ఎలాగైనా ఆ ప్రేమను చెడగొట్టాలని ఆ గిరిజన ప్రాంతానికి బయలు దేరతాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శర్మకి ఓ గిరిజన పెద్దాయన పరిచయం అవుతాడు. ఆయన ఎప్పుడో గతంలో తమ ప్రాంతంలో జరిగిన చంద్ర- మాలచ్చిమి అనే జంట తాలూకు ప్రేమ కథ చెబుతాడు. నిజమైన ప్రేమకు ప్రతిరూపం లాంటి ఆ ప్రేమ కథ విన్న తర్వాత శర్మ లో ఎలాంటి మార్పు వచ్చింది?, చివరకు శర్మ తన కూతురు ప్రేమను అంగీకరించాడా?, లేదా ? అసలు అప్పటి జంట ప్రేమ కథ కు – నేటి జంట ప్రేమ కథకు మధ్య కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో.. ప్రధానమైనది ఈ కథ జరిగిన నేపధ్యమే. సినిమా చూస్తున్నంత సేపు అందమైన అడవి మధ్యలోకి వెళ్లి అక్కడి పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు శ్రీ నారాయణ రాసుకున్న సున్నితమైన ప్రేమ కథలు కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఆయన భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన ఫీల్ ను అండ్ ఎమోషన్స్ ను పండించిన విధానం అబ్బురపరుస్తుంది. అలాగే రెండు ప్రేమ కథలు కూడా ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తాయి. వీటితో పాటు శ్రీ నారాయణ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. ప్రతి సీక్వెన్స్ కి ఒక ఎమోషనల్ సీన్ తో సినిమా పై ఆసక్తిని పెంచారు.
దాంతో పాటు కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. ఇక ఈ సినిమాలో ప్రేమ, మరియు కులం, ప్రాంతం, జాతి వంటి సున్నితమైన అంశాలను, వాటి వల్ల ఆడవాళ్ళు పడుతున్న ఇబ్బందలను చూపించటం చాలా బాగుంది. అలాగే నేటి సమాజంలో కొంతమంది కుల మత పిచ్చితో ఎంత మూర్ఖంగా ఉంటారో అని కొన్ని కఠినమైన వాస్తవాల ఆధారంగా కొన్ని సంఘటనలను చాలా వాస్తవికంగా చూపించటం బాగా ఆకట్టుకుంటుంది.
దర్శకుడు శ్రీ నారాయణ రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. చంద్ర – మాలక్ష్మి ప్రేమ కథ, అద్భుతమైన ఫీల్ తో సాగుతూ మంచి అనుభూతిని మిగులుస్తోంది. ఈ ప్రేమ కథలో అనేక భావోద్వేగాలు మన హృదయాన్ని కదిలిస్తాయి. ఇదే కోవకు చెందే మరో ప్రేమ కథ రామ్ – విందు లది. పైగా సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు శ్రీ నారాయణ బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది. కాకపోతే, అందరూ నూతన నటినటులతోనే సినిమాని తెరకెక్కించడం ఈ సినిమా స్థాయిని కొంతవరకు తగ్గించింది అనే చెప్పాలి.
సాంకేతిక విభాగం :
శ్రీ నారాయణ దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫీల్, ఎమోషన్, ఆడవాళ్ళ కి సంబంధించిన సోషల్ మెసేజ్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. అలాగే నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి.
నిర్మాతలు మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మిచినందుకు వారిని అభినందించి తీరాలి. వారి ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.
తీర్పు :
‘@లవ్’ అంటూ వచ్చిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడ్ని భావేద్వేగమైన ప్రేమ కథలతో, సున్నితమైన భావోద్వేగాలతో చాలా బాగా మెప్పిస్తుంది. ప్రధానంగా సినిమా చూస్తున్నంత సేపు స్వచ్చమైన ప్రకృతి లోకి వెళ్లి ఆ ఎమోషనల్ పాత్రలను మనం దగ్గర నుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు శ్రీనారాయణ రాసుకున్న ప్రేమ కథలు, పాత్రలు, ఆ పాత్రాల తాలూకు సంఘర్షణలు.. మళ్లీ ఆ కథలను, పాత్రలను ఒకే కథలోకి కలిపిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది.
బాటమ్ లైన్: మనసులను కదిలించే స్వచ్చమైన ప్రేమ కథ!
రేటింగ్ : 3 /5