Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( global star Ram Charan)నటించిన గేమ్ చేంజెర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లే సాధిస్తోంది. ఈ క్రమంలో పైరసీ భూతం లో చిక్కుకుంది ఆ చిత్రం. సంక్రాంతికి సినిమా బెనిఫిట్ షో పడగానే పైరసీ కాపీలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. విశాఖలో అయితే ఏకంగా లోకల్ టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీంతో సినిమా నిర్మాతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఇప్పటికే మిక్సిడ్ టాక్ తో ఉన్న ఈ సినిమా.. పైరసీ రావడం.. కేబుల్ టీవీలో ప్రసారం చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్మాతల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
* విశాఖలో
విశాఖ నగరంలో( Visakha City ) ఓ ప్రాంతానికి చెందిన కేబుల్ టీవీ నిర్వాహకులు ఈరోజు ఉదయం గేమ్ చేంజర్ సినిమాను ప్రదర్శించారు. ఈ విషయం చిత్ర నిర్మాతల వరకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోకల్ టీవీ ఛానల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పైరసీ కాపీని ఎక్కడ సంపాదించాలన్న వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే లోకల్ ఛానల్ ఎక్విప్మెంట్ ను సైతం సీజ్ చేశారు. పైరసీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు సిద్ధపడుతున్నారు.
* కేబుల్ టీవీ లపై ఫోకస్
విశాఖలో వెలుగు చూసిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ( cable TV) నిర్వహణపై దృష్టి పెట్టారు ఏపీ పోలీసులు. అయితే చాలా ప్రాంతాల్లో కేబుల్ టీవీలో పైరసీ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పలరాజు అనే నిర్వహకుడు విశాఖలో గేమ్ చేంజర్ చిత్రాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అప్పలరాజు పై కేసు నమోదు చేయడమే కాకుండా ఆయనకు సంబంధించి పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖ నగరవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులు జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
* సినిమా చుట్టూ కుట్ర
ఇప్పటికే గేమ్ చేంజర్( game changer) సినిమా విషయంలో కుట్ర జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సినిమా విషయంలో వైసీపీ నేతలు కుట్ర చేశారన్న అనుమానాలు జనసేన నుంచి వినిపించాయి. పుష్ప 2 చిత్రం విషయంలో వైసీపీ వర్సెస్ జనసైనికులు అన్న పరిస్థితి మారింది. పుష్ప 2 చిత్రం విషయంలో సైతం వైసీపీ అభిమానులు తెగ హడావిడి చేశారు. మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ వేరు చేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విషయంలో డివైడ్ టాక్ వచ్చేలా చేయడం వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా పైరసీని తీసుకురావడంతో అనేక రకాల అనుమానాలు తావిస్తున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగడంతో ఇది సంచలనంగా మారింది.