Amit Shah : ఏపీలో( Andhra Pradesh) రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. అది మరువక ముందే మరోసారి హోంమంత్రి అమిత్ షా ఏపీకి రానున్నారు. అయితే వరుసగా బిజెపి అగ్ర నేతలు ఏపీకి వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ విశాఖలో పర్యటించారు. రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు. కాగా ప్రధాని మోదీ పర్యటనకు పది రోజులు పూర్తికాకుండానే ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పాటు ఆయన ఏపీలో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి ఏపీ బీజేపీ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించనున్నారు.
* 18న ఏపీకి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah) ఏపీ పర్యటనకు గాను ఈ నెల 18న రానున్నారు. ఆరోజు రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. నేరుగా ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్ళనున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇటీవల తిరుపతి తొక్కిసలాట, ఎన్డీఏ నేత్రల మధ్య సఖ్యత లాంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస్సు చేస్తారని బిజెపి నేతలు తమ ప్రకటనలో తెలిపారు.
* ఆ రెండు ప్రాజెక్టులకు శ్రీకారం
గన్నవరం సమీపంలో ఎన్డీఆర్ఎఫ్( NDRF), ఎన్ఐడిఎం ప్రాంగణాలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. వాటిని హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈనెల 19న ప్రారంభించిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందులో హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈనెల 18న సీఎం చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటిస్తారు. అదే రోజు తన నివాసంలో అమిత్ షా తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. చంద్రబాబు నివాసంలోనే అమిత్ షా రాత్రికి భోజనం చేస్తారని తెలుస్తోంది. 19న ప్రారంభోత్సవాల అనంతరం చంద్రబాబు పర్యటనకు బయలుదేరుతారు.
* చురుగ్గా ఏర్పాట్లు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) రెండు రోజుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అధికారిక కార్యక్రమం కావడంతో అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా కు ఘన స్వాగతం పలికేందుకు ఎన్డీఏ నేతలు సన్నద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన వెంటనే హోం మంత్రి అమిత్ షా కూడా వస్తుండడంతో రాష్ట్రంలో ఎన్డీఏలో ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. అయితే వరుసగా కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం విశేషం.