Puri-Vijay Devarakonda : దర్శకుడు పూరి జగన్నాధ్ కెరీర్ ని పాతాళంలోకి పడేసింది లైగర్ చిత్రం. హీరో విజయ్ దేవరకొండకు కూడా భారీ షాక్ ఇచ్చింది. ఈ చిత్ర ఫలితం సెట్స్ పై ఉన్న జనగణమన ఆగిపోయేలా చేసింది. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న జనగణమన నుండి నిర్మాతలు తప్పుకున్నారు. పూరి జగన్నాధ్ కి హీరోలు దొరకడం లేదు. ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు టైర్ టు హీరోలు కూడా ఆసక్తి చూపడం లేదు. అలాగే లైగర్ మూవీ నిర్మాతలుగా ఉన్న పూరి జగన్నాధ్, ఛార్మి ఈడీ అధికారులు విచారణ ఎదుర్కొన్నారు. హీరో విజయ్ దేవరకొండను సైతం అధికారులు విచారణకు పిలిచారు.
కాగా లైగర్ మూవీ మీద భారీ హైప్ ఏర్పడింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఎగ్జిబిటర్స్ భారీ ధరలకు హక్కులు కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రూ. 55 నుండి 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విజయ్ దేవరకొండ మార్కెట్ కి అది చాలా ఎక్కువ. వరల్డ్ వైడ్ రూ. 90 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. ఇక ఫస్ట్ షోనే డిజాస్టర్ టాక్ రావడంతో కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. లైగర్ చిత్రాన్ని ఎగబడి కోన్ ఎగ్జిబిటర్స్, బయ్యర్లు, లీజర్స్ పెద్ద మొత్తంలో నష్టపోయారు.
నష్టాల్లో కొంత మొత్తం తిరిగి చెల్లించేందుకు పూరి జగన్నాథ్, ఛార్మి ముందుకు వచ్చారు. ఎగ్జిబిటర్స్ కి హామీ ఇచ్చారు. అయితే లైగర్ నిర్మాతలు మాట నిలబెట్టుకోలేదు. ఎగ్జిబిటర్స్ కి నష్టాలు చెల్లించని నేపథ్యంలో వారు నిరసనకు దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నిరసన ప్రారంభించారు. లైగర్ చిత్రంతో నష్టపోయిన మాకు న్యాయం చేయాలంటూ రిలే నిరాహార దీక్షలకు దిగారు. మే 12 నుండి ఈ నిరాహార దీక్షలు చేపట్టారు.
మరి పూరి జగన్నాధ్ ఈ నిరసనలకు స్పందిస్తారా? లేదంటే టాలీవుడ్ పెద్దలు వారికి న్యాయం చేస్తారా? అనేది చూడాలి. గతంలో పూరి జగన్నాధ్ ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. నేను చెప్పినట్లు నష్టాలు చెల్లిస్తాను. కాదని నిరసనలకు దిగితే ఒక్క రూపాయి ఇవ్వను. ముఖ్యంగా నిరసనలు చేసిన వాళ్లకు తిరిగి చెల్లించనని హెచ్చరించారు. టాలీవుడ్ వర్గాల వాదన ప్రకారం లైగర్ ప్లాప్ అయినప్పటికీ పూరి-ఛార్మిలకు ఎలాంటి నష్టం రాలేదట. పైగా అధిక ధరలకు హక్కులు అమ్ముకున్న నేపథ్యంలో కోట్లు సంపాదించారట. లైగర్ ప్లాప్ సాకుగా చూపి హీరో విజయ్ దేవరకొండకు కూడా పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది.