Lenin Movie: అక్కినేని అఖిల్ కెరీర్ లో ‘లెనిన్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని , ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలి అనే కసితో ఈ చిత్రాన్ని చేశాడు . ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా , ఇప్పటికీ సరైన హిట్ లేకపోవడం తో , అక్కినేని అభిమానులు అఖిల్ పట్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. పాపం ప్రతీ సినిమాకు అఖిల్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు , కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అనే భావన కేవలం అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఉంది. అందుకే తప్పుల నుండి అఖిల్ చాలా నేర్చుకున్నారని , ఈసారి ఆయన టార్గెట్ మిస్ అయ్యే అవకాశం లేదని అక్కినేని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు , ట్రేడ్ కూడా అఖిల్ ని ఈసారి గట్టిగానే నమ్ముతోంది.
అందుకే తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ ని జరుపుకుంటుంది ఈ చిత్రం. కేవలం ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం లోనే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘ఏజెంట్’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్ బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇక నైజాం , సీడెడ్ ప్రాంతాలకు కలిపి కచ్చితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండే 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కెరీర్ మొత్తం మీద ఒక్క హిట్ సరైనది లేదు, గత చిత్రం ఆల్ట్రా డిజాస్టర్, అయినప్పటికీ ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే , అఖిల్ ని ఈసారి ట్రేడ్ చాలా గట్టిగా నమ్ముతుందని అర్థం.
ఇప్పటి వరకు విడుదలైన ప్రీ రిలీజ్ ప్రొమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి , ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అఖిల్ తండ్రి నాగార్జున ఈ చిత్రాన్ని చూసి పుత్రోత్సాహం తో మురిసిపోతున్నారు. చూస్తుంటే అఖిల్ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ చిత్రం విడుదలై నేటికి నాలుగు రోజులు అయ్యుండేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పర్ఫెక్షన్ కోసం జులై 10 కి వాయిదా వేశారు. మరి అఖిల్ ఈసారైనా అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
