ఒక్కొక్కరూ ఒక్కో అనుభూతిని ఇష్టంగా ఆస్వాదిస్తారు. హీరోయిన్స్ కు కూడా అనేక రకాల అనుభూతులు ఉంటాయి. అయితే హోమ్లీ బ్యూటీ లావణ్య త్రిపాఠీకి మాత్రం ప్రకృతితో మమేకం అవ్వాలని, ప్రతి క్షణం పచ్చని గాలిని అనుభూతి చెందాలనే తీవ్రమైన కోరిక ఉందట. మొత్తానికి ఆమెలోని ఎవరికీ తెలియని సహజసిద్ధమైన ప్రకృతి ప్రేమికురాలిని తాజాగా పరిచయం చేసింది.
కొండ ప్రాంతంలోని పచ్చని చెట్లు మధ్యలో సేద తీరితే, అక్కడే ఇల్లు కట్టుకుని బతికితే ఆ అనుభూతి విలువ సెవన్ స్టార్ హోటల్స్ లో కూడా దక్కదు. అందుకే ఆ అనుభూతిని ఆస్వాదించడానికి ఈ అందాల రాక్షసి ప్లాన్ చేసుకుంటుంది. లావణ్యా త్రిపాఠీ చిన్నప్పటి నుండే ప్రకృతి ప్రేమికురాలు అట. ఆమెకు పచ్చని చెట్లన్నా, పంట పొలాలన్నా ప్రాణం అట.
పైగా లావణ్యకి వ్యవసాయం చేయాలనే కోరిక కూడా బలంగా ఉందట. అందుకే ముస్సోరీకి దగ్గర్లో కొండ మీద ఉన్న చమసారి అనే గ్రామంలో వ్యవసాయ భూమిని కూడా కొనుక్కుంది. ఇప్పుడు అక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ బ్యూటీ ప్లాన్ చేసుకుంటోంది. అయితే ఇక్కడ తానూ కట్టించబోయేది రెగ్యులర్ హౌస్ కాదు అట. ఒక కేఫ్ ని తలపించేలా ఇల్లు కట్టించాలనే ఆలోచనలో ఉందట.
అయితే, కేఫ్ అనగానే అందరూ వ్యాపారం కోసం అనుకుంటారు, కాదు. ఇది కేవలం నా కుటుంబ సభ్యుల కోసమే కట్టిస్తున్నాను. వ్యాపారం కానే కాదు అంటూ సిగ్గు పడుతూ సెలవిచ్చింది లావణ్య. ఇక పర్యావరణాన్ని కాపాడే రీతిలో సహజమైన వస్తువులతో తన ఇంటి నిర్మాణాన్ని ప్లాన్ చేస్తోందట ఈ బ్యూటీ. మొత్తానికి ప్రకృతిలో బతకడానికి లావణ్య తెగ ఉబలాట పడుతోంది.