Metallic Saree: కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఈ సామెత మిగతా విషయాల్లో ఏమోగానీ ఫ్యాషన్ కు మాత్రం వర్తించదు. ఎందుకంటే ఎప్పుడో 80 ల నాటి కాలంలో ట్రెండ్ అయిన బూట్ కట్ పాయింట్లు మిలీనియం సంవత్సరంలోనూ కొత్త రూపంతో సందడి చేశాయి. ఆపిల్ కట్ షర్ట్స్, ఓవర్ నెక్ షర్ట్స్, ట్రబుల్ స్టిచ్చింగ్ ఫుల్ హాండ్స్ షర్ట్స్ మార్కెట్ ను దున్నేశాయి. అయితే ఫ్యాషన్ ఒక మగవాళ్ళకు మాత్రమే పరిమితం కాదు. మగవాళ్లకు ఫ్యాషన్ విషయంలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ ఆడవాళ్లకు కాదు. మరి ముఖ్యంగా సినీ తారలకు అసలు కాదు. వారు ఎప్పుడు ఏది ధరిస్తే అదే ఫ్యాషన్.. అందుకే ఫ్యాషన్ ప్రపంచం సినీ తారల చుట్టూ తిరుగుతూ ఉంటుంది..
ఇక ఇప్పటి స్మార్ట్ ప్రపంచంలో సినీ తారలు మోడ్రన్ డ్రెస్ లతో పాటు చీరలను కూడా ఎక్కువగా ధరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్లలలో చీర కట్టుతో అభిమానులను అలరిస్తున్నారు. చీరల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. ఈ జనరేషన్ సినీ తారలు మాత్రం మెటాలిక్ చీరలకు ఓటు వేస్తున్నారు.. మెటాలిక్ చీర అనేది లోహాల దారాలతో చేస్తారు కాబట్టి.. దానికి ఆ పేరు వచ్చింది. మెటాలిక్ చీరల తయారీ అనేది సులువైన వ్యవహారం కాదు. మెటాలిక్ చీర తయారీలో లోహాల దారాలు వాడతారు.. నైపుణ్యం ఉన్నవారు మాత్రమే ఈ చీరలను తయారు చేస్తారు.. మనదేశంలో అయితే మనీష్ మల్హోత్రా, రాఘవేంద్ర రాథోడ్ వంటి వారు ఈ మెటాలిక్ చీరల తయారీలో సిద్ధహస్తులు. అందుకే ఈ డిజైనర్లు తయారుచేసిన చీరలు ధరించడానికి తారలు పోటీ పడుతుంటారు.
ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్, కోలీ వుడ్ అని తేడా లేకుండా వివిధ చిత్రపరిశ్రమల్లో జరిగిన వేడుకల్లో సినీ తారలు మెటాలిక్ చీరలు ధరించి సందడి చేశారు. వారిలో జాన్వికపూర్, ఆలియా భట్, కియారా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, పూజా హెగ్డే, హెబ్బా పటేల్, నభా నటేష్, తాప్సీ పన్ను, అనుపమా పరమేశ్వరన్, శిల్పా శెట్టి, తమన్నా వంటి వారు మెటాలిక్ చీరలు ధరించి అభిమానులకు అందాల విందు అందించారు. ఇంకా కొంతమంది సినీ తారలైతే మెటాలిక్ తో తయారైన మోడ్రన్ దుస్తులు ధరించి అలరించారు. ముందుగానే చెప్పినట్టు సినీ తారలు ఏది ధరిస్తే అదే ఫ్యాషన్.. ప్రస్తుతం మెటాలిక్ చీరలు నయా ఫ్యాషన్ ట్రెండ్.