Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టి.. కుర్రకారును తనవైపు తిప్పుకున్న బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి పాత్రలో నటిస్తోంది. దీంతో పాటు, నానీ హీరోగా నటిస్తోన్న శ్యామ్ సింగరాయ్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు, పోతినేని, లింగుస్వామి దర్శకత్వంలో వచ్చే చిత్రాల్లోనూ కృతి అవకాశం దక్కించుకుంది. ఇలా వరుస సినిమాలకు ఓకే చెప్తూ.. దూసుకెళ్లిపోతోంది.
కాగా, తాజాగా, మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగా డాటర్ సుష్మిత నిర్మించనున్న సినిమాలో ఈ బేబమ్మ హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. సుష్మిత సొంతంగా ప్రొడక్షన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన బ్యానర్‌పై నిర్మించిన వెబ్‌సిరీస్‌లు మంచి సూపర్‌హిట్ టాక్ అందుకున్నాయి.
ఇప్పుడు సినిమాల్లోనూ తన బ్యానర్‌తో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు సుష్మిత. ఈ క్రమంలోనే తొలి సినిమాను లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే కృతి శెట్టిని హీరోయిన్గా ఎంపికచేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు సుష్మిత. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
కాగా, ఇప్పటికే దాదాపు షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ్యామ్‌సింగరాయ్.. థియేటర్లలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రమోషన్స్ కూడా చాలా పగడ్బందీగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ.. సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. డిసెంబరు 24న ఈ సినిమా విడుదల కానుంది. కాగా, బంగార్రాజు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాడు.
