Kota Srinivasa Rao: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేయగల సత్తా ఉన్న నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao). ఆయన చెయ్యని క్యారక్టర్ లేదు, చెయ్యలేని క్యారక్టర్ కూడా లేదు. అలాంటి మహానటుడు నేడు తెల్లవారుజామున తన తుది శ్వాసని విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. గత కొంతకాలం నుండి అనారోగ్యం కారణంగా కోట శ్రీనివాస రావు సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాడు. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాస రావు ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసినప్పుడు, గుర్తు పట్టలేని స్థితిలో ఉండడం ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడు అంటూ విచారం వ్యక్తం చేశాడు. అయితే నిన్నటి తరం వారికి కోట శ్రీనివాస రావు గురించి తెలియని విషయం ఏది ఉండకపోవచ్చు.
కానీ నేటి తరం ప్రేక్షకులకు కోట శ్రీనివాస రావు రేంజ్ ఏంటో కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. కోటశ్రీనివాస రావు కి మొదటి నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది, కానీ విధి ఆయన్ని నటుడ్ని చేసింది. కాలేజీ రోజుల్లోనే ఎన్నో నాటకాల ద్వారా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ కోట శ్రీనివాస రావు నటన పై తనకు ఉన్న పట్టు ఎలాంటిదో చూపించేవాడు. సినిమాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ పోషణ కోసం బ్యాంక్ ఉద్యోగం లో చేరాడు . ఒకపక్క ఉద్యోగం చేస్తూ, మరోపక్క అప్పుడప్పుడు నాటకాల్లో పాల్గొంటూ నటన పై ఇష్టాన్ని చూపేవారు. అలా నాటకాలు వేస్తున్న సమయం లో కోట శ్రీనివాస రావు గారి నటనని చూసి ఎంతో ఇష్టపడిన డైరెక్టర్ కె వాసు , ‘ప్రాణం ఖరీదు’ చిత్రం లో కోట కు ఒక మంచి క్యారక్టర్ ఇచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాతోనే వెండితెర అరంగేట్రం చేశాడు. అలా మొదలైన కోటా శ్రీనివాస రావు కెరీర్, ఆరంభం లోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఇక జంధ్యాల దర్శకత్వం లో తెరకెక్కిన ‘అహనా పెళ్ళంట’ చిత్రం లోని కోట శ్రీనివాస రావు క్యారక్టర్ అప్పట్లో సెన్సేషన్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఎవ్వరూ ఊహించనంత స్థాయికి ఎదిగాడు. ఒకానొక దశలో ఆయన ఏడాదికి 30 కి పైగా సినిమాల్లో నటించిన సందర్భాలు ఉండేవి. ఒక్క రోజుకి గాను ఆయన కాల్ షీట్ లక్ష నుండి రెండు లక్షల రూపాయలకు పైగా ఉండేది. సంవత్సరం లో ఒక్క రోజు కూడా ఖాలీగా ఉండేవాడు కాదు, రోజుకు 20 గంటలు పని చేసేవాడు. ఆరోజుల్లో కోటా శ్రీనివాసరావు ఒక ఏడాది లో సంపాదించే డబ్బులు స్టార్ హీరోలు కూడా సంపాదించలేకపోయేవారని అప్పట్లో అనేవారు. అలాంటి మహానటుడు నేడు తిరిగి రాని లోకాలకు పయనం అవ్వడం మన తెలుగు సినీ పరిశ్రమ చేసుకున్న దురదృష్టం.