Teenmar Mallanna Attack: కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు.. పాత్రికేయుడు.. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేశారు. ఆదివారం హైదరాబాదులోని మేడిపల్లిలో ఉన్న కార్యాలయం పై కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న జాగృతి కార్యకర్తలు ఒక్కసారి దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడుతున్న సమయంలో జాగృతి కార్యకర్తలు చేతిలో ఇనుప రాడ్లు, రాళ్లు పట్టుకున్నారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన శాసనమండలి సభ్యుడు కావడంతో ప్రభుత్వం తరఫున పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన మీదికి రావడంతో గన్ మెన్ కాల్పులు జరిపారు. గన్మెన్ కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది.
Also Read: ట్రంప్ టారిఫ్ మోత.. కెనడా, బ్రెజిల్ కుయ్యో. ముర్రో..!
తీన్మార్ మల్లన్న తనకి న్యూస్ ఛానల్ ద్వారా కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బిసి రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టామని.. తద్వారా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిందని.. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కల్వకుంట్ల కవితను మరి ఆమె అభిమానులు అభినందించారని.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒక మహిళ అని చూడకుండా కల్వకుంట్ల కవితపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని.. అందువల్లే తాము ఈ దాడికి దిగాల్సి వచ్చిందని జాగృతి కార్యకర్తలు పేర్కొన్నారు. గత ఏడాది ఢిల్లీ మద్యం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన నాటి నుంచి తీన్మార్ మల్లన్న ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. అప్పటినుంచి తాము ఓపిక పడుతున్నామని.. అయినప్పటికీ ఆయన ధోరణి మార్చుకోలేదని.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం వల్లే తాము దాడులకు దిగామని జాగృతి కార్యకర్తలు పేర్కొన్నారు.
జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న మీదికి దూసుకురావడంతో గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. దీంతో కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీన్మార్ మల్లన్న పై దాడి చేసేందుకు ప్రయత్నించడం మాత్రమే కాకుండా.. అతని కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు.. కంప్యూటర్లు పగలగొట్టారు. అద్దాలను ధ్వంసం చేశారు. చివరికి సీసీ కెమెరాలు సైతం పగలగొట్టారు. కార్యాలయం మొత్తం విధ్వంసం సృష్టించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ తుపాకీ ద్వారా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో కార్యకర్తలు కంట్రోల్లోకి వచ్చారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలను తీన్మార్ మల్లన్న పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు మొత్తం రికార్డ్ అయ్యాయ అని తెలుస్తోంది. మరి దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇటీవల కేటీఆర్ పై థంబ్ నెయిల్స్ పెట్టారని ఆరోపిస్తూ గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేసిన విషయం తెలిసిందే. దానిని మర్చిపోకముందే జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయం పై దాడికి దిగడం విశేషం.