Koratala Siva: టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు కొరటాల శివ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన కొరటాల, ఆ తర్వాత సొంతంగా డైరెక్టర్ గా మారి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కొరటాల శివ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆయనకీ ‘దేవర’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో గ్రాండ్ గా విడుదలైంది.
మిడ్ నైట్ షోస్ నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యాయి. అయితే అభిమానులు, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా ఏమాత్రం కూడా అందుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పడం, క్లైమాక్స్ బాగాలేకపోవడం వల్ల డివైడ్ టాక్ వచ్చింది. కానీ చివరికి ఎబోవ్ యావరేజి టాక్ వద్ద ఈ చిత్రం ఆగింది. కాబట్టి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ చాలా తేలిక అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల సందర్భంగా కొరటాల శివ ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది . ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ తో కచ్చితంగా భవిష్యత్తులో సినిమా చేస్తాను, చాలా మంది మా కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్రకటించి ఆలస్యం అవ్వడం తో క్యాన్సిల్ అని అనుకున్నారు. అల్లు అర్జున్ తో తియ్యాల్సిన సినిమాని ఎన్టీఆర్ తో ‘దేవర’ గా తీసారని అన్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు, దేవర కథ వేరే, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా వేరే’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీ లో మీరు దాదాపుగా అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసేసారు, పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తారు అని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నాకు ఎప్పటి నుండో ఉంది. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యాడు. చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక అసలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు, ఉప ముఖ్యమంత్రి హోదాలో క్షణం తీరిక లేకుండా ఆయన గడపడం మనమంతా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పట్లో ఆయనతో సినిమా తీయడం కష్టమే’ అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.