Jagan: ఏపీ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు అయ్యింది. తిరుమలలో వివాదం నేపథ్యంలో వైసిపి పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా చెప్పుకొచ్చారు. వైసిపి పై ముప్పేట విమర్శలు ఎదురు కావడంతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. వివరణ ఇవ్వాలని చూశారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు దేవాలయాల్లో పూజలు జరపాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం తిరుమల వెళ్లి… రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోవాలని భావించారు. షెడ్యూల్ కూడా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో జగన్ పర్యటన రద్దయింది. దీంతో వైసిపి శ్రేణులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యాయి. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో రకరకాల ప్రచారం తెరపైకి వచ్చింది. జగన్ ను అడ్డుకుంటామని ధార్మిక సంఘాలతో పాటు కూటమి పార్టీలు సైతం ప్రకటించాయి. అయితే ఎటువంటి దూకుడు చర్యలు వద్దని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తిరుమలలో పోలీస్ యాక్ట్ అమలు చేశారు. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.అతిగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ప్రకటించారు. మరోవైపు డిక్లరేషన్ అంశాన్ని టిటిడి తెరపైకి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వరని.. కచ్చితంగా తిరుమలలో అడుగు పెడతారని.. స్వామి వారిని దర్శించుకుంటారని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అక్కడ కొద్దిసేపటికే జగన్ పర్యటన రద్దయినట్లు తెలిసింది. అయితే జగన్ చర్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
* ఆర్భాటం చేస్తామని
వాస్తవానికి లడ్డు వివాదం నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ ను రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు ర్యాలీగా తీసుకెళ్తామని వైసిపి శ్రేణులు భావించాయి. అయితే దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఒకవైపు డిక్లరేషన్ వివాదం, ఇంకోవైపు వైసీపీ శ్రేణులపై కేసులకు భయపడి జగన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే భారీగా కార్యక్రమం ఉంటుందని వైసిపి నాయకత్వం భావించింది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలకు దాదాపు పదివేల మంది వైసీపీ శ్రేణులు వస్తారని అంచనా వేసింది. అయితే పోలీస్ ఆంక్షలు నేపథ్యంలో జగన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.
* వెనక్కి తగ్గిన జగన్
అయితే ఇంత జరిగాక జగన్ వెనక్కి తగ్గడంపై కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ ఆర్భాటాలు లేకుండా ఎక్కడికి వెళ్ళడని.. వైసిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఏక్ నిరంజన్ అంటూ తిరుమల వెళ్లలేక పర్యటన రద్దు చేసుకున్నాడంటూ కూటమినేత్తులు ఆరోపిస్తున్నారు. అయితే డిక్లరేషన్ విషయంలో టిటిడి పట్టుదలతో ఉండడం, దేవదాయ శాఖ నిబంధనలు తెరపైకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని భావించి జగన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
* ఆ ఇబ్బందులు వస్తాయని
తిరుమల వెళ్లిన తర్వాత డిక్లరేషన్ పై సంతకం చేసినా, చెయ్యకపోయినా లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని.. ఇది మతపరమైన అంశం కావడంతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి జగన్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తిరుమలకు వెళ్లిన తర్వాత శనివారం శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు.. డిక్లరేషన్ పై సంతకం చేస్తే కొత్త చిక్కు వచ్చి పడే అవకాశం ఉంది. గతంలో మీరు ఎందుకు డిక్లరేషన్ పై సంతకం చేయలేదని కూటమి పార్టీలు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇంకో వైపు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే తిరుమల సాంప్రదాయాన్ని, హిందూ దేవుళ్లను జగన్ గౌరవించడం లేదని విమర్శలు వస్తాయి. ఇలా ఎలా చూసినా తమకే నష్టమని భావించి జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జగన్ తిరుమల పర్యటన రద్దు కావడంతో కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ శ్రేణులు మాత్రం నిరాశలో కూరుకుపోయాయి.