KJQ Movie Review : గెలిచినోడిది ఏముంది.. ఓడినోడి కథ చదువు.. జీవితంలో కొన్ని సత్యాలు అందరికీ సూట్ కావు.. అలాంటి వేడి నుంచి పుట్టిందే ఈ కథ.. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా నటించిన KJQ శుక్రవారం విడుదలైంది. దర్శకుడు కిరణ్ ఆకస్మిక మరణంతో కొంత ఆలస్యమైనా చిత్ర యూనిట్ పట్టుదలతో సినిమాను పూర్తి చేసి తెరమీదకు తెచ్చారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ కూడా ఆకట్టుకునేలా నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం ప్రాంతాల్లో ప్రమోషన్స్ నిర్వహించారు. ఎస్ఎల్వీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏకంగా సందీప్ వంగా కూడా ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడంతో మరింత హీట్ పెంచింది. సంపత్ నంది, శ్రీకాంత్ ఓదెల లాంటి ప్రముఖ దర్శకులు ఈ సినిమా ఈవెంట్ లలో పాల్గొన్నారు. ఇప్పుడీ చిత్రం దేశ, విదేశాల్లో విడుదలైంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై పాజిటివ్ స్పందించడంతో ఆసక్తి పెంచింది. ఇంతకీ ఈ యాక్షన్, క్రైం, ఏ రేటెడ్ డ్రామా ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. చూద్దాం..
కథేంటంటే..
దావుద్ ఇబ్రహీం, బిన్ లాడెన్ ఇలాంటి వారి పాత్రలు మారితే ఎలా ఉంటారు. వాళ్లు ఇంట్లో ఎలా ఉంటారు.. వాళ్ల బావోద్వేగాలు ఎలా ఉంటాయి. వాళ్లకు ఒక మంచి జీవితం ఉంటే ఎలా లీడ్ చేస్తారు.. అనే మాటలతో కథ ప్రారంభమవుతుంది. అనాథలా తిరిగే పార్థా(దీక్షిత్ శెట్టి)ను రాజు(మురళీధర్ గౌడ్) చెరదీస్తాడు. తన వద్ద పనిలో పెట్టుకుంటాడు. కానీ పార్థాకు సమాజంలో ఎదురయ్యే అనేక ఛీత్కారాల నేపథ్యంలో ఎదిరిస్తే కింగ్ లా బతుకొచ్చని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలోనే పార్థాకు అమ్మను పోగొట్టుకున్న జాక్ ఎదురవుతాడు.. ఇద్దరూ కలిసి పెరిగి మంచి స్నేహితులవుతారు.. ఈ క్రమంలో అనేక నేరాల్లో పార్థాకి జాక్ అండగా నిలుస్తాడు.. ఆ తర్వాత పెండ్లి, ప్రేమల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. మనిషిలో అహం పెరిగితే ఎలా ప్రవర్తిస్తాడు.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తే ఏమౌవుతుంది.. అనడానికి పార్థా పాత్ర అద్దంలా నిలుస్తుంది. ప్రేమను పోగొట్టుకొని మనిషిలా బతకాలని డిసైడ్ అయిన జాక్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది.. కింగ్, జాక్ చివరి వరకు కలిసే ఉంటారా..? ‘బతుకు వేరు.. బతకడం వేరు.. లోకంలో మంచోళ్లు చెడ్డొళ్లు అంటూ ఉండరు’.. ఎవరి అవసరాలు.. వారిని ఆ పాత్రలు పోషింపజేస్తాయి..’ అంతే అంటూ కథ సాగుతుంది.
ఎవరెలా నటించారంటే..
హీరోయిన్ గా నటించిన క్వీన్ (యుక్తి తరేజా) ఆకట్టుకున్నది. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. ఇక మొదటి సినిమాతోనే శశి ఓదెల ఆకట్టుకున్నాడు. సహజంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అటు అమ్మను.. ఇటు ప్రేయసి అలిజాను పోగొట్టుకొని మానసిక సంఘర్షణ కలిగిన పాత్రలో జీవించాడు. మొదటి సినిమాతోనే 100 కోట్ల రికార్డు బద్దలు కొట్టిన శ్రీకాంత్ ఓదెల తమ్ముడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన శశి తనకంటూ సొంత ఇమేజ్ పొందేందుకు ప్రయత్నించాడు దసరా సినిమాలో చిన్న పాత్రతో ఆకట్టుకున్న శశి.. ఇప్పుడు లీడ్ రోల్ లో నటించి మరోసారి ఔరా అనిపించుకున్నాడు. ఇక దీక్షిత్ శెట్టి సినిమాలో కీలక పాత్ర కు తగ్గట్టుగా తనలోని నటుడిని తెరపై దించాడు. అహం నిండిన మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనే పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు దీక్షిత్ శెట్టి. 1గంట 50 నిమిషాల నిడివితో సాగే కథ సీరియస్ గా మనల్ని సినిమాలోకి తీసుకెళ్తుంది. మొత్తంగా యువ తారాగణం దీక్షిత్, శశి, యుక్తి ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.. ఇక చిచ్చాగా మురళీధర్ గౌడ్ మరోసారి తన పాత్రకు జీవం పోశాడు. ఇక కేడీ సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన దర్శకుడు కిరణ్ రెండో సినిమాగా KJQ ను రూపొందించాడు. సినిమా పూర్తయ్యే సమయంలో ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు.. ఈ క్రమంలో పలువురు డైరెక్టర్లు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు.
బలాలు
-హీరోలు, హీరోయిన్
-సాగతీత లేకపోవడం
బలహీనత
నేర తీవ్రత పెంపొందించే అంశాలు
-హాస్యం లేకపోవడం, సీరియస్ డోస్ ఎక్కువవడం
చివరగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
-కార్తీక్ రెడ్డి(ఎస్పీ)