KA Closing Collections: ఈ ఏడాది చిన్న హీరోల సినిమాల మేనియా బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు కల్కి, దేవర చిత్రాలతో కళ్ళు చెదిరే బ్లాక్ బస్టర్స్ కొట్టి, వందల కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని రాబట్టి ఇండస్ట్రీ కి ఒకప్పటి పూర్వ వైభవం ని తీసుకొచ్చారు. అయితే ఈ రెండు సినిమాల విడుదల గ్యాప్ లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఇరగకుమ్మేసాయి. వాటిల్లో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రం కూడా ఒకటి. విడుదలకు ముందే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. క్లైమాక్స్ గురించి కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఎలివేషన్స్ కి విడుదలకు ముందు అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా అంత సీన్ ఉందా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ విడుదల తర్వాత క్లైమాక్స్ గురించి కిరణ్ అబ్బవరం చాలా తక్కువ చెప్పాడు అని ఆడియన్స్ కి అనిపించింది.
ఆ రేంజ్ లో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ పేలింది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఈ చిత్రంతో పాటు విడుదలైన ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ చిత్రాలను కూడా డామినేట్ చేసింది. అలా భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లిన ఈ చిత్రం 25 రోజులకు థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఒకసారి చూద్దాము. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతంలో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మూడు కోట్ల 60 లక్షల రూపాయలకు జరగగా, దాదాపుగా రెండు కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించింది.
అదే విధంగా సీడెడ్ లో విడుదలకు ముందు కోటి 40 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో 2 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ బయ్యర్స్ కి అయితే జాక్పాట్ తగిలింది అనే చెప్పాలి. కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఈ ప్రాంతంలో జరుపుకోగా, ఫుల్ రన్ 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే 5 కోట్ల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. ఓవర్సీస్ లో 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం భారీగా నష్టాలు వచ్చాయని టాక్. మొదటి వీకెండ్ తర్వాత ఈ చిత్రానికి ఈ ప్రాంతాల నుండి వసూళ్లు రాలేదట. ఓవరాల్ లో క్లోజింగ్ లో 21 కోట్ల రూపాయలకు పైగా షేర్, 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.