Kingdom postponed once again : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం మరోసారి వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మే 31 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా చాలా వరకు వర్క్ బ్యాలన్స్ ఉండడం తో జులై 4 కి వాయిదా వేశారు. అప్పటి లోపు ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ కి సంబంధించిన అనేక సన్నివేశాలను రీ షూట్ చేసుకున్నారు. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెకండ్ హాఫ్ ని చూసి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అసంతృప్తి చెందాడని, సెకండ్ హాఫ్ మొత్తాన్ని రీ షూట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గానే గోవా లో కొన్ని కీలక సన్నివేశాలను హీరో హీరోయిన్ మధ్య చిత్రీకరించారు. అయినప్పటికీ ఇంకా బోలెడంత వర్క్ బ్యాలన్స్ ఉండిపోయింది. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా బ్యాలన్స్ ఉండిపోయింది.
ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుద్ తో సినిమా అంటే మేకర్స్ కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే ఆయన చేతిలో కనీసం డజనుకు పైగా సినిమాలు ఉంటాయి. ఆ కారణం చేత ఔట్పుట్ సమయానికి డెలివరీ చేయలేకపోతున్నాడు. ఆయన ఇచ్చినప్పుడే మ్యూజిక్ ని తీసుకోవాలి. గట్టిగా డిమాండ్ చేసే ధైర్యం కూడా మేకర్స్ కి ఉండదు. అలా ఆయనకు సంబంధించిన వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయడమే ఉత్తమం అని మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. ఆగష్టు మొదటి వారం లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నది. మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ మార్కెట్ కి మించి ఖర్చు చేశారు. దాదాపుగా 80 కోట్ల రూపాయిలు ఖర్చు అయినట్టు సమాచారం.
Also Read : రీషూట్ కి సిద్దమైన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’..ఆ సన్నివేశాలపై హీరో అసంతృప్తి?
అయితే ఈ సినిమా కోసం నితిన్ ‘తమ్ముడు’ చిత్రం కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు జులై నాల్గవ తేదీన తమ్ముడు చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు గా ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలిపాడు. కానీ కింగ్డమ్ మూవీ టీం దిల్ రాజు ని వాయిదా వేసుకోవాల్సిందిగా స్పెషల్ రిక్వెస్ట్ చేయడం తో తమ్ముడు చిత్రాన్ని జులై 25 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ జులై నాల్గవ తేదీన ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. జూన్ 12 న విడుదల అవ్వాల్సిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అనేక కారణాల చేత వాయిదా పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం ‘కింగ్డమ్’ స్థానంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.