Crime News : మనదేశంలో వివాహాలను విభిన్నంగా జరుపుకుంటారు. ఒక్క ప్రాంతంలో ఒక్కో సంస్కృతి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో రోజులపాటు వివాహాలు జరుపుతుంటే.. మరి కొన్ని ప్రాంతాలలో దానిని ఒక్కరోజు వేడుకకు పరిమితం చేస్తున్నారు. అంతిమంగా వివాహాలను మాత్రం ఘనంగా జరుపుతున్నారు. ఒక అంచనా ప్రకారం మనదేశంలో వివాహల మార్కెట్ విలువ రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వివాహల కోసం భారతీయులు బంగారాన్ని, వస్త్రాలను, ఇతర ఖరీదైన బహుమతులను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. కాదు వివాహం ద్వారా తమ దర్పాన్ని, ఆర్థిక స్థోమతను ప్రదర్శించుకుంటున్నారు. ఈ జాబితాలో రాజస్థాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో జరిగిన వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
Also Read : పట్టపగలు కిడ్నాప్ నా? సీమలో మళ్లీ మొదలైందా?
రాజస్థాన్లోని భివాడి అనే ఓ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇటీవల ఓ వివాహ వేడుక జరిగింది. దానికంటే ముందు నిశ్చయ తాంబూలాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత వివాహం రోజు వరుడికి అక్కడి సంప్రదాయం ప్రకారం 500 నోట్లతో 14.5 లక్షల విలువైన నగదును దండ రూపంలో అల్లారు. ఆ దండను వరుడి మెడలో వేశారు. ఆ దండతో వరుడిని కారులోకి ఎక్కించారు. మండపానికి అతడిని తీసుకెళ్తుండగా మధ్య మార్గంలో తుపాకులతో ముసుగు దొంగలు వచ్చారు. వరుడు వెళుతున్న కారును అడ్డగించారు. ఆ తర్వాత తుపాకులు చూపించి బెదిరించారు. కదిలితే కాల్చి చంపేస్తామని హెచ్చరించారు. వరుడి మెడలోన దండను దొంగిలించారు. వరుడిని తీవ్రంగా కొట్టి పారిపోయారు. వరుడు తీవ్రంగా గాయపడటంతో వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..
దొంగతనానికి పాల్పడింది తెలిసిన వారేనని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. ” మా సంప్రదాయం ప్రకారం ఇలా కరెన్సీ నోట్లు వేయడం ఆనవాయితీ. కాకపోతే కొంతమంది దీనిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. మేమంటే పడని వ్యక్తులు దొంగలకు సమాచారం ఇచ్చారు. నోట్ల దండను దొంగిలించారు. కారు మండపానికి వెళ్లే సమయంలోనే అడ్డగించారు. వరుడిని తీవ్రంగా కొట్టి పారిపోయారు. దొంగలు చేసిన పని వల్ల వివాహం ఆగిపోయింది. దాదాపు 14.5 లక్షల విలువైన నగదు దొంగల పాలైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. వారు సమీపంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇదంతా అయిన వారి పనే అని” బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించి.. దొంగలను పట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.