Khushi Kapoor: అతిలోక సుందరి అనగానే గుర్తుకు వచ్చే అలనాటి తార శ్రీదేవి. ఆమె భౌతికంగా దూరం అయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఇంకా కొలువుదీరే ఉన్నారని చెప్పుకోవచ్చు. శ్రీదేవి అందం, నటనతో ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు.
శ్రీదేవి లేకపోయినప్పటికీ ఆమె ఇద్దరు కుమార్తెలు సినీరంగంలోకి అరంగేట్రం చేశారు. పెద్ద కూతురు జాన్వీకపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్ ఎప్పుడూ తన తల్లిని గుర్తు చేస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో నటించి పేరు సంపాదించారు..తాజాగా తెలుగులోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు జాన్వీ.. ఇక ఖుషి కపూర్ తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ఈమె తన తల్లి డ్రెస్సులో కనిపించి అందరిని ఆకర్షించారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అందాల తార శ్రీదేవి.. 2013వ సంవత్సరంలో ఐఎఫ్ఏ రెడ్ కార్పెట్ లో షోస్టాపర్ గా గౌనును ధరించారు. ఇప్పుడు అదే గౌనును ఖుషి కపూర్ ధరించి తన మాతృమూర్తికి ఘనంగా నివాళులు అర్పించారని తెలుస్తోంది. తన మొదటి సినిమా ‘ది ఆర్చీస్’ ప్రదర్శనకు హాజరైన ఖుషి కపూర్ అమ్మను స్మరించుకుంటూ గతంలో తన తల్లి ధరించిన ఐకానిక్ గౌనును ధరించారు. దీంతో అభిమానులు తమ అభిమాన తారను గుర్తు చేసిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, బాలీవుడ్ బాద్ షా కుమార్తె సుహానా ఖాన్ నటించిన ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. వెరోనికా, జుగ్ హెడ్, ఆర్చీ, జెట్టీ, ఎథెల్, డిల్టన్ మరియు రెగ్గీ జీవితాలపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీ నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.