Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి (జక్కన్న) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు సినిమాలను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లారు. ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకున్న రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబుతో చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మొదటిసారి మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు సాంకేతిక నిపుణులకు సంబంధించి ఒకే టీంను కొనసాగించిన రాజమౌళి తాజాగా కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ స్థానంలో మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
అలాగే టీమ్ లో మరో కీలక సభ్యుడిగా ఉన్న వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ స్థానంలో కమల్ కన్నన్ ను తీసుకోనున్నారని సమాచారం. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ స్థానంలో కూడా జక్కన్న మార్పులు చేయాలనే యోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు సమాయత్తం అవుతున్నారని సమాచారం.
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా.. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. అడవుల్లో జరిగే అక్రమాలపై పోరాడే నాయకుడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ జరుపుకునేందుకు రెడీ అవుతుందని సమాచారం. కాగా ఇప్పటినుంచే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.