
కీర్తి సురేశ్. సినిమా కుటుంబం వచ్చినా అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. తమిళ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక కుమార్తె అయిన కీర్తి 2000 సంవత్సరంలో బాల నటిగా పరిశ్రమకు పరిచయమై తర్వాత హీరోయిన్‌గా మారింది. 2015లో విడుదలైన ‘నేను.. శైలజ’లో యువ హీరో రామ్ పోతినేతి సరసన నటించి ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. ఆపై, నేను లోకల్, అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించిన కీర్తి.. ‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. దాంతో, ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది.
మహానటి తర్వాత వరుస ఆఫర్లు చుట్టుముడుతున్నప్పటికీ కీర్తి మాత్రం ఎప్పట్లానే ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓకే చెబుతోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. డిమాండ్ ఉన్నప్పుడే ఖజానా నింపుకోవాలన్న సినిమా ఇండస్ట్రీ పాలసీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదామె. ఎంత పెద్ద రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా గ్లామర్ ఒలికించే పాత్రలు, బోల్డ్ క్యారెక్టర్లకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ప్రేక్షకులు తనను ఓ సాధారణ నటిగానే కాకుండా మంచి నటిగా చూస్తున్నారని కీర్తి చెబుతోంది. గ్లామరస్, బోల్డ్ క్యారెక్టర్లలో తనను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరని అంటోంది. తనకు కూడా అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదని చెప్పింది. అందుకే పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నానని తెలిపింది.