
చంద్రబాబు వయసు 70 ఏళ్లు దాటింది.. ఆయన పని అయిపోయిందంటున్నారు. 2024 వరకూ ఇంకా వృద్ధాప్యంలోకి జారుకుంటాడు. ఇక ఆయన వారసత్వం.. పుత్రరత్నం లోకేష్ బాబు శక్తి సామర్థ్యాలపై టీడీపీలోనే సందేహాలున్నాయంటున్నారు అందుకే ఏపీలో 151 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ జగన్ కు సరిజోడిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా జపిస్తున్న పేరు ‘ జూనియర్ ఎన్టీఆర్’. బాబు ఓడిపోగానే సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అందరూ గళమెత్తారు. తెలుగుదేశాన్ని స్థాపించిన నందమూరి తారకరామారావు వారసుడు ఎన్టీఆరే ఈ బాధ్యతలు చేపట్టాలని అంటున్నారు.అయితే చంద్రబాబు, లోకేష్ లు ఎన్టీఆర్ ను ఆమోదించే పరిస్థితుల్లో లేరు. నారా బాబు చేతిలోనే పచ్చపార్టీ బంధీ అయిపోయిందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.
సరే నారా వారి అధికార దాహమని ఊరుకుందాం.. మరి నందమూరి వంశ పౌరుషం గురించి బాగా మాట్లాడే బాలయ్య బాబుకు ఏమైంది.? అల్లుడు నారా లోకేష్ కు పోటీగా ఎవరూ వద్దని ఆయన అనుకుంటున్నారా? నందమూరి రక్తమే రావాలని ఆయన ఎందుకు కోరుకోవడం లేదు. జూ.ఎన్టీఆర్ ను రాజకీయాల్లో రావడానికి ఎందుకు వద్దంటున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అంతర్గత, బాహ్య సంక్షోభాలు ఎన్నో చవిచూసింది. చూస్తోంది. పార్టీ ఎన్నోసార్లు ఓడిపోయింది. కోలుకోకుండా అయ్యింది. ప్రస్తుతం టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమిని 2019 ఎన్నికల సందర్భంగా చవిచూసింది. చంద్రబాబు వృద్ధాప్యం ఇప్పుడు టీడీపీకి రాబోయే ఏళ్లలో శాపంగా మారనుంది. మరి కొత్త రక్తాన్ని నాయకత్వాన్ని టీడీపీలోకి తీసుకురావడానికి సమయం ఇదే..
టీడీపీ శ్రేణులంతా కోరుతున్నది ఒక్కటే.. లోకేష్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని.. కానీ అగ్రశ్రేణి టీడీపీ నాయకత్వం మాత్రం దీనిపై ఆసక్తి చూపించడం లేదు. సరే నందమూరి వంశానికే చెందిన హీరో, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలక్రిష్ణ అయినా ఈ విషయంపై స్పష్టత ఇస్తాడని అందరూ ఆశించారు.
తాజాగా టీడీపీ తరుఫున ప్రచారం చేయడానికి జూ.ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు బాలయ్య ఆసక్తికరంగా స్పందించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అంకితభావంపై ఆధారపడి ఉంటుందని.. అతడికి చాలా కెరీర్ ఉందని.. పూర్తికాల రాజకీయాల్లోకి నిమగ్నమవ్వడం ఇప్పుడు కష్టమని అన్నారు. పార్టీ కోసం పనిచేయాలా వద్దా అనేది ఎన్టీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. రాజకీయాలు, సినిమాలు రెండింటి మధ్య తాను గారడీ చేస్తున్నానని బాలయ్య తెలిపారు.
బాలయ్య వ్యాఖ్యలను బట్టి టీడీపీలోకి జూ.ఎన్టీఆర్ తిరిగి ప్రవేశించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని.. అప్పుడిప్పుడే ఆయనను రానిచ్చే పరిస్థితి లేదని తేటతెల్లమవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారంచేశారు. ప్రజల వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ సభలకు భారీగా జనం వచ్చారు. అయితే ఈ ప్రచారంలోనే ఎన్టీఆర్ కారు యాక్సిడెంట్ కు గురికావడం.. ఆ తరువాత చంద్రబాబు, టీడీపీ నాయకత్వం ఎన్టీఆర్ ను ప్రచారానికి దూరం పెట్టడంతో ఎన్టీఆర్ టీడీపీ రాజకీయాలకు దూరం జరిగారు. లోకేష్ ఎంట్రీతో టీడీపీలో నందమూరి ఆధిపత్యమే లేకుండా పోయింది.
-నరేశ్ ఎన్నం