Karthi Sequel Movies: కార్తీ జోరు మామూలుగా లేదు. పొన్నియన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ.. మొదటి పార్ట్ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక సర్దార్ కూడా మంచి వసూళ్ళు రాబడుతున్నది.. సాధారణంగా ఒక హిట్ సినిమాకి సీక్వెల్ తీయడం అంటే అంత సులభం కాదు.. ఎందుకంటే వీటికి సక్సెస్ ఛాన్స్ చాలా తక్కువ.. పదివేల క్రితం మనీ అనే చిన్న సినిమాకు కొనసాగింపుగా మనీ మనీ అని తీస్తే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇలాంటి వరుసలో చాలా డిజాస్టర్లు వచ్చాయి. కిక్ 2, మన్మధుడు 2, సర్దార్ గబ్బర్ సింగ్, సత్య 2, గాయం 2… ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు.. ఇవేవీ మొదటి భాగాలకు కొనసాగింపు కాదు.. కేవలం టైటిల్స్ క్రేజ్ వాడుకొని బిజినెస్ చేయాలని చూసినవి.. అయితే వీటిల్లో కంటెంట్ మరీ దారుణంగా ఉండడంతో ప్రేక్షకులు వీటిని డిజాస్టర్లు చేసి పెట్టారు. అందుకే నెంబర్ 2 అంటే రాజమౌళి మినహా కొంతమంది దర్శకులకు టెన్షన్.

కార్తీ ది భిన్నమైన రూట్
పీఎస్_1తో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. పీఎస్_2 తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు. వచ్చే ఎండాకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.. విజయ్ తో చేయబోయే సినిమా పూర్తి చేశాక దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 మొదలుపెడతాడు. విక్రంలో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ను ఇందులో జోడిస్తారని ప్రచారం జరుగుతోంది. దీపావళి సినిమాల్లో సర్ప్రైజ్ హిట్ అందుకున్న సర్దార్ కు కొనసాగింపు ఉంటుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సో మొత్తం మూడు సీక్వెల్స్ లో కార్తీ రాబోయే రెండేళ్లలో కనిపించబోతున్నాడు. ఇవే కాకుండా కొన్నేళ్ళ క్రితం వచ్చిన నాన్ మహాన్ ఆల్ల( నా పేరు శివ), మదరాసు పట్టణం ( తెలుగు డబ్బింగ్ రిలీజ్ కాలేదు) లను కొనసాగించేందుకు వాటి దర్శకులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తమిళ మీడియాలో టాక్ ఉంది.

కానీ వాటికి చాలా సమయం పట్టేలా ఉంది. మొత్తానికి ఏ స్టార్ హీరోకు అచ్చిరాని సీక్వెల్స్ కార్తీకి మాత్రం బాగా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కార్తీ ఊహించిన దానికంటే సర్దార్ ఎక్కువ సక్సెస్ అవ్వడమే కాకుండా… దీపావళి సందర్భంగా ఒక్క తెలుగులోనే చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టింది.. అందుకే ఇక్కడి అభిమానులు అంటే కార్తీకి ప్రత్యేకమైన ప్రేమ.. ఆమధ్య నయనతారతో కలిసి కాష్మోరా వంటి సినిమా తీయడంతో కొంచెం తన మార్కెట్ డౌన్ అయింది.. కానీ ఎప్పుడైతే లోకేష్ కనగరాజ్ ఖైదీ విడుదల అయిందో అప్పుడే కార్తి మార్కెట్ మళ్లీ పట్టాలెక్కింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళ హీరోల్లో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య తర్వాత ఆ స్థాయిలో బలమైన మార్కెట్ ఉన్న నటుడు కార్తీ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.