Vijay- Ajith: సంక్రాంతి.. ఈ పండగ పేరు చెప్తే అందమైన ముగ్గులు, నోరూరించే పిండి వంటలు, ఇంటికి తరలివచ్చే పాడిపంటలు, కోడిపందాలు.. ఇవి మాత్రమే కాదు.. వీటితో పాటు సినిమాలు కూడా. సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ జమానా దాకా సంక్రాంతి అంటే సినిమాలకు ఒక సెలబ్రేషన్. వినోదం కోసం చాలామంది ఎంచుకునే బాట సినిమా. అయితే ఈసారి సంక్రాంతి మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, విజయ్ సినిమాలు పోటీలో ఉండడంతో థియేటర్లు ఎలా సర్దుబాటు జరుగుతాయోనని ఎగ్జిబిటర్లు ఆందోళనలో ఉన్నారు. ఇదే క్రమంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డతీరుగా అజిత్ ఎంట్రీ ఇస్తుండడంతో లెక్కలన్నీ తారుమారు అయ్యాయి.. బహుశా 2023 సంక్రాంతి గత కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ చూడని టఫ్ ఫైట్ చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. అజిత్ తునివుని సైతం సంక్రాంతికి వస్తుందని ఆ చిత్రం నిర్మాత బోనికపూర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.. విజయ్ వారసుడిని ఢీకొంటామని స్పష్టంగా చెప్పేశారు.. తంగా ఐదు సినిమాల రాకతో సంక్రాంతి పండగ రచ్చ మామూలుగా ఉండేలా లేదు.. మరోవైపు అఖిల్ ఏజెంట్ కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. కానీ మొదటి పాన్ ఇండియా సినిమా చేసిన అఖిల్ తో ఈ చిత్ర నిర్మాతలు ఎంత మేరకు రిస్క్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

తెలుగు మార్కెట్ లైట్
వాస్తవానికి అజిత్, విజయ్ లకు తెలుగులో పెద్ద మార్కెట్ లేదు.. మాస్టర్, విజిల్, అదిరింది కమర్షియల్ గా ఎంత పే చేసినప్పటికీ ఇక్కడి స్టార్లతో పోటీ పడేంత సీన్ విజయ్ కి ఇంకా రాలేదు. అది నిర్మాత దిల్ రాజు కూడా తెలుసు. అందుకే స్ట్రైట్ తమిళ వెర్షన్ గా తీసి టాలీవుడ్ లో కేవలం డబ్బింగ్ చేసి వదులుతున్నారు. పెద్దగా ఆడకపోయినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. పెట్టొచ్చు దానివల్లే మనకు కొన్ని థియేటర్లు తగ్గడం తప్ప. అజిత్ ఎప్పుడో తెలుగు రాష్ట్రాలను లైట్ తీసుకున్నాడు. ఎంతగా అంటే ఇటీవల విడుదలైన వలిమై సినిమా టైటిల్ నైనా తెలుగులోకి అనువదించకుండా నేరుగా వదిలేంత… అక్కడ అది ఎన్ని సంచలనాలను సృష్టించినా తెలుగులో మాత్రం సో సో గానే ఆడింది.
ఓవర్సీస్ లో సమస్య
డిసెంబర్ 16న అవతార్ 2 ఉంటుంది.. ఎంత లేదనుకున్నా కనీసం నెలపాటు స్ట్రాంగ్ రన్ ఉంటుంది.. ఈ నేపథ్యంలో స్క్రీన్లు తగ్గించేందుకు డిస్ట్రిబ్యూటర్లు అసలు ఒప్పుకోరు.. అలాంటప్పుడు ఐదు క్రేజీ సౌత్ మూవీస్ కి థియేటర్లు సర్దుబాటు చేయాలంటే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్. ఈ సినిమాలకు టాక్ ఏ మాత్రం అటు ఇటు అయినా నెత్తిమీద తడిగుడ్డ తప్పదు. పోనీ పోటీ పడుతున్న వారిలో మీడియం హీరో ఉంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోరు.

ఎవరికి వారు తీసుకొని రీతిలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్లు. ఇప్పటికే నాలుగు సినిమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న డిస్ట్రిబ్యూటర్లు అజిత్ ఎంట్రీ తో మరింత బిగుసుకుపోయారు. ఈ పద్మవ్యూహాన్ని ఎలా చేదిస్తారో చూడాలి.. లేకుంటే నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చి కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటారేమో వేచి చూడాలి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. బహుశా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కావచ్చు.