Rahul Gandhi Jodo Yatra : 50 ఏళ్లకు చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిన రాహుల్ గాంధీ తన అభిరుచులను మాత్రం ఇప్పటికీ వదలుకోవడం లేదు. పిల్లలతో పిల్లవాడిగా.. పెద్దలతో పెద్దోడిగా.. మహిళలకు ఓ అన్నగా ఆప్యాయత పంచుతూ ముందుకెళుతున్నాడు.. కేరళలలో యువతులతో కలిసి నడిచాడు.. తెలంగాణలో నిన్న హీరోయిన్ పూనమ్ కౌర్ తో కలిసి చేతిలో చేయి వేసి కదిలాడు. ఇప్పుడు తన పాదయాత్రకు మద్దతుగా వచ్చిన చిన్న పిల్లలతో కలిసి పరుగు పందెంలో పాలుపంచుకున్నాడు.

రాహుల్ గాంధీ పాదయాత్ర ఈరోజు మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకూ సాగుతోంది. ఈయన పాదయాత్రలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సడెన్ గా స్కూలు పిల్లలు రాహుల్ పాదయాత్రలో ఆయనతోపాటు నడిచేందుకు వచ్చారు. దీంతో వారిని చూసి ముచ్చటపడిన రాహుల్ .. పరుగు పందెం పెట్టుకుందాం.. ఎవరు బాగా పరుగులు పెడుతారో వారే విజేత అని సరదాగా ఆటపట్టించారు. దానికి సై అన్న పిల్లలతో కలిసి పరుగులు లంఖించారు.
ఇక ఈ పరుగులో అందరికంటే ముందు రాహుల్ పరిగెత్తాడు. పిల్లలు వెనుకబడ్డారు. ఇక రాహుల్ తో పాటు పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి రెండోస్థానంలో నిలిచాడు.ఈ సరదా సన్నివేశం రాహుల్ పాదయాత్రలో చోటు చేసుకుంది.
ఇక రాహుల్ గాంధీ వెంట పాదయాత్రలో పాల్గొంటున్న భద్రతా సిబ్బంది, పోలీసులు ఈ హఠాత్ పరిణామానికి ఖంగుతిన్నారు. రాహుల్ వెంట పరుగులు తీశారు. మీడియా కూడా ఫొటోలు, వీడియోలు తీసేందుకు పోటీపడుతూ పరిగెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.