Kannappa Movie: నటుడు మోహన్ బాబు సారథ్యంలో భారీ తారాగణంతో నిర్మించిన కన్నప్ప సినిమా చూసి వచ్చిన తరువాత ఆ సినిమాకు సంబంధించి వచ్చిన ట్రోల్స్, విడుదల కాకముందే అట్టర్ ఫ్లాప్ అంటూ విడుదలైన మొదటి రోజే సమీక్ష ల పేరుతో కొంతమంది ఆ సినిమాపై చేసిన విమర్శలు నన్ను సినిమా చూసేందుకు మరీ ప్రేరేపించాయి. ఈ విధంగా కూడా ప్రేక్షకులను థియేటర్ వైపుకు నడిపించే అవకాశం ఉంటుందనీ, హాల్ లో ఇంటిల్లిపాదితో వచ్చిన వారి రద్దీ చూసి అర్థమైంది.
ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు బాపు తీసిన భక్త కన్నప్ప సినిమా కన్నా, ఈ సినిమా వెయ్యి రేట్లు గొప్పగా అనిపించింది.
సినిమా ఆద్యంతం అందంగా, అద్భుతంగా నిర్మించారు. ఫస్ట్ హాఫ్ సరదా అనిపించినా, సెకండ్ హాఫ్ లో కథ ఉత్కంఠ సన్నివేశాలు ప్రేక్షకులను మైమరిపించాయి. ఈ సినిమాలో ప్రధానంగా శరత్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. మహాదేవ శాస్త్రిగా గంభీరమైన నటన ప్రదర్శనతో మోహన్ బాబు, రుద్ర పాత్రలో ప్రభాస్ ఒకరికొకరు పోటీపడి నటించారు. మంచు విష్ణు కన్నప్ప పాత్రలో ఇమిడిపోయారు. చక్కగా అన్ని సన్నివేశాలకు అనుగుణంగా పాత్ర ఔచిత్యాన్ని బట్టి నటించారు.
మూడు గంటల పాటు సినిమాలో వివిధ ఘట్టాలను చూసి రసానుభూతి అనుభవించిన ప్రేక్షకులను చివరి ఘట్టం కట్టిపడేసేలా ఉంది. ఇంత బాగా నిర్మించిన సినిమాను బాగాలేదు అని సినిమా చూసిన వారెవ్వరు అనరు. కేవలం రివ్యూలు చూసి సినిమా చూడకుండా వదిలేస్తే, చాలా మంది ప్రేక్షకులు మంచి అనుభూతిని పొందలేకపోతారెమో అని నా భావన.
ఇంకో విషయం ఏమంటే బాపు తీసిన భక్త కన్నప్ప లో రావుగోపాల్ రావు పోషించిన మహాదేవశాస్త్రి పాత్రను కన్నప్ప సినిమాలో మోహన్ బాబు పోషించారు. ఈ పాత్ర చిత్రీకరణ లో వ్యత్యాసం కనిపిస్తుంది. గొప్ప దర్శకుడిగా పేరు గడించిన బాపు గారు ఆ పాత్ర నిర్మాణంలో ఎందుకు విలువలు పాటించలేదో అర్థం కాలేదు. కన్నప్పలో పరమ నిష్ఠగరిష్టుడైన మహాదేవ శాస్త్రిగా చూపించగా, బాపు గారు మాత్రం ఆ పాత్రకే విలనిజం అంటగట్టేందుకు, అనవసరంగా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా జుగుప్సాకరమైన, అభ్యంతరకరమైన విషయాలను జోడించినట్లు కనిపించింది. కన్నప్పను హీరో గా చూపించేందుకు ఒక వర్గాన్ని విలన్ గా చూపించేందుకు అంత హీనంగా చిత్రీకరించడం ఆ గొప్ప దర్శకుడి ఆలోచననా లేక వేరే వ్యక్తుల ప్రభావమో తెలియదు. కానీ మోహన్ బాబు సినిమా ఆ విషయంలో హుందాగా చిత్రీకరించారు. స్థల పురాణం అని పేరుతో తమకు తోచినవిధంగా ఏ వర్గాన్ని కించపరిచినట్లు చూపించడం సరికాదని తెలుసుకొని జాగ్రత్తగా చిత్రీకరించారు.
హై టెక్నికల్ వాల్యూస్ తో చిత్రీకరించిన ఈ సినిమాలో అందమైన లొకేషన్లు అలరించాయి. కన్నప్ప లో ఈ కాలానికి తగినట్లుగా క్రైమ్, రొమాన్స్ సన్నివేశాలు కూడా సమపాళ్లలో అందించారు.
మిగతా చిన్న, చిన్న విషయాలు పట్టించుకునేలా అనిపించలేదు. అర్జున్ నటించిన మంజునాథ, విష్ణు నటించిన కన్నప్ప లో కొన్ని సీన్ లు ఒకేలా కనిపించినా కొంత వైవిధ్యం చూపించారు.
భక్త కన్నప్ప లో పాటలు ఆ సినిమా హైప్ ను పెంచాయి. కానీ కన్నప్ప లో పాటలతో పాటు సన్నివేశాలు, లొకేషన్లు అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ రౌండ్ స్కోర్ కు వంకలు లేవు. కథ ఒకటే అయినా, తెలిసిన కథ అయినా, తెలియకపోయినా ఒక హై వ్యాల్యూ దృశ్య కావ్యంగా మలిచే సమయంతో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ఈ సినిమాలో తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. చిన్నారులు, యువత ఎక్కువగా చూసేలా ఉండాలి.