Hero Darshan: మనిషన్నాక పొరపాట్లు చేయడం సాధారణం. అయితే ఆ పొరపాటును గుర్తించి పశ్చాత్తాపం చెందడం అందరికీ మంచిది. ఇక దొమ్మీలు, దొంగతనాలు, హత్యలు, మానబంగాలు చేసినవారు సమాజంలో ఉండడం ప్రమాదకరం వారిలో మార్పు రావాలన్న ఉద్దేశంతో న్యాయస్థానాలు శిక్షలు విధిస్తాయి. అయితే శిక్షలతో కొందరిలో మార్పు వస్తున్నా.. కొందరు మరింత నేరస్థులుగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. సామాన్యులు నేరం చేస్తే సభ్య సమాజం చిన్న చూపు చూస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా సమాజం నుంచి బహిష్కరించినంత పని చేస్తుంది. కానీ, రాజకీయ నేతలు.. డబ్బున్నోళ్లు.. సెలబ్రిటీలు నేరం చేస్తే వారు మరింత హీరోలుగా మారుతున్నారు. అలాంటి వారు జైల్లో ఉన్నా.. వారికి రాచ మర్యాదలు అందుతున్నాయి. సాధారణ వ్యక్తులు జైల్లో ఉంటే కూలీ పనులు చేయాలి. వంటలు చేయాలి.. అంట్లు తోమాలి. సెలబ్రిటీలు ఉంటే మాత్రం వారి సేవలోనే పోలీసులు, జైలు అధికారులు తరించడం పరిపాటిగా మారింది. చట్టం అందరికీ సామానమే అయినప్పుడు ఈ తేడాలు ఎందుకు చూపుతున్నారు అంటే.. ధన బలం.. అధికార బలం ఉండడమే కారణం. కన్నడ పోలీసులు మరోమారు తమ నైజాన్ని నిరూపించుకున్నారు. తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ సేవలో తరిస్తున్నారు. జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరేట్ పట్టుకుని తాగుతూ కనిపించాడు దర్శన్.
వీఐపీ సేవలు..
దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ ఉన్నాడు. అతనికి జైలులో పోలీసులు రాచమర్యాదలుచేస్తున్నారు. జైల్లో అతనితోపాటు కొంతమంది రౌడీషీటర్ ఖైదీలు కూడా కుర్చీలో కూర్చుని ఉండటం ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ తూగదీప, పవిత్ర గౌడ తోపాటు మరో 15 మంది సహచరులకు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 28 వరకు పొడిగించింది. ఈ క్రమంలో జైలులో ఉన్న దర్శన్‌కి వీఐపీ సౌకర్యాలు కల్పించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేణుకాస్వామి తండ్రి కాశీనాథ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
హంతకుడికి రాచ మచ్యాదలా..
తన కొడుకును చంపిన దర్శన్ ఓ హంతకుడని అతనికి రాచ మర్యాదలు చేయడం ఏంటని ప్రశ్నించాడు. దర్శన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు. మాకు పోలీసులు, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యమేస్తోంది. ఇది నాకు షాకింగ్ న్యూస్. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని రేణుకా స్వామి తండ్రి కోరారు. దర్శన్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
జూన్‌లో రేణుస్వామి హత్య..
ఇదిలా ఉంటే.. జూన్ నెలలో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేశాడు. దర్శన్, పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకువచ్చి దారుణంగా కొట్టి చంపారు. జూన్ 9న బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో బాధితుడికి షాక్ ఇచ్చారని, తీవ్రంగా దాడి చేయడంతో రక్తస్రావమైందని, అతడి శరీరంపై అనేక గాయాలున్నాయని తేలింది.