Kaikala Satyanarayana: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గత రెండ్రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కైకాల ఆరోగ్య పరిస్తితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఐసీయూలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. బీపీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
కొద్దిరోజుల క్రితం తన నివాసంలో కైకాల కాలు జారిపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కాగా, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని సినీ నటులు, అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా, ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి కాసేపు గడిపారు. కాగా, ఆయన ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న చిరు.. వైద్యుల సాయంతో ఆయనకు కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండమని మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పినట్లు పేర్కొన్నారు. 60 ఏళ్లుగా సినీ రంగంలో కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుమారు 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఇక చిరుతో కలిసి చాలా సినిమాల్లోన్నే నటించారు కైకాల. యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటి చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అనే చెప్పాలి.